ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే.. తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు.
నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి కానీ, జగన్లా చంపే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. తలకాయలు అయినా.. మామిడి కాయలు అయినా తొక్కించుకుపోతానంటున్నాడని, మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారని, మళ్లీ జగన్ రాడు అని భరోసా ఇవ్వమంటున్నారని తెలిపారు. "కూటమి ప్రభుత్వం తొలి ఏడాది 16వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తూ.. రోజుకు 2.5 లక్షల మంది కడుపు నింపుతున్నాం.
అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నాం. వైకాపా ప్రభుత్వం వస్తే ఎలాంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తాం అని పెద్దిరెడ్డి అంటున్నారు. వైకాపా నేతలు తమ కక్షలు, పగలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు.
రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబే. హంద్రీ-నీవాకు చివరన ఉన్న అడివిపల్లి రిజర్వాయరు నీటిని తీసుకొస్తాం. నీవా బ్రాంచ్ ద్వారా కల్యాణి డ్యామ్ నింపి తిరుపతికి తాగునీరు అందిస్తాం.
తిరుపతి (Tirupati) పట్టణంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్కు తరలిస్తాం. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి.. మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారు.
నాడు కల్తీ మద్యం వల్ల జంగారెడ్డిగూడెంలో 27 మంది చావుకు కారణమయ్యారు. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవు. తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి” అని నిమ్మల అన్నారు.