అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో వివిధ దేశాలకు చెందిన సుమారు 11 వేల యూట్యూబ్ ఛానళ్లను తాజాగా గూగుల్ తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలా వేటుపడిన వాటిలో ఒక్క చైనాకు చెందినవే 7,700 ఉన్నట్లు గూగుల్ పేర్కొంది.
అవి భారత్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించింది. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ కంటెంట్‌ను పోస్టు చేస్తున్నట్లు తెలిపింది.
అలాగే రష్యాకు చెందిన 2 వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లను తొలగించినట్లు వెల్లడించింది. నాటో, ఉక్రెయిన్‌లను విమర్శిస్తూ రష్యాకు మద్దతుగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని గూగుల్ పేర్కొంది. అంతేకాక రష్యాలోని కొన్ని సంస్థలకూ సైతం ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది.
చైనా, రష్యాతో పాటు ఇజ్రాయెల్, తుర్కియే, ఇరాన్, ఘనా, అజర్‌బైజాన్, రొమేనియాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను కూడా తొలగించినట్లు వెల్లడించింది. ఆయా దేశాలకు చెందిన యూట్యూబ్ ఛాన్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నిరాధార వార్తలు, కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నందున చర్యలు తీసుకున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.