రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సికింద్రాబాద్ మరోసారి నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, లాబోరేటరీ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 434 ఉద్యోగాలు ఈ కేటగిరీలో అందుబాటులోకి రానున్నాయి.
ఖాళీలను పోస్టుల వారీగా పరిశీలిస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ 272, డయాలిసిస్ టెక్నీషియన్ 4, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్ 33, ఫార్మసిస్ట్ 105, రేడియోగ్రాఫర్ 4, ఈసీజీ టెక్నీషియన్ 4, లాబోరేటరీ టెక్నీషియన్ 12 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధులు సంబంధిత పోస్టులకు అనుగుణంగా బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, రేడియోగ్రఫీ, డిప్లొమా, డీఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి పోస్టులను బట్టి కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వరకు ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 18, 2025లోపు దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశలను పూర్తి చేసిన అభ్యర్థులు తుది ఎంపిక పొందనున్నారు.
ఎంపికైన అభ్యర్ధులకు పోస్టుల వారీగా వేతనాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు నెలకు రూ.44,900, డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రూ.35,400, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ పోస్టులకు రూ.29,200, ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు రూ.25,500, లాబోరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,700 జీతభత్యాలు చెల్లించనున్నారు. వైద్యరంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే అభ్యర్ధులకు ఇది మంచి అవకాశం కానుంది.