ప్రఖ్యాత అంతర్జాతీయ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన సిబ్బందిపై కొత్త నిబంధనలు అమలు చేస్తూ, క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రతిష్ఠను కాపాడే దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం, పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులు యూనిఫాంలో ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కాఫీ, టీ లేదా శీతల పానీయాలు తాగకూడదు. ఆ సందర్భంలో వారికి నీళ్లు మాత్రమే అనుమతించబడతాయి, అయితే అవి కూడా ఇతరులకు పెద్దగా కనిపించకుండా జాగ్రత్తగా తాగాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై కాఫీ, టీ లేదా ఇతర పానీయాలను కేవలం సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాఫ్ రూమ్‌లు, కేఫ్టీరియాలలో మాత్రమే సేవించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అలవాట్లు విమానయాన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందన్న ఆందోళనతో ఈ కొత్త ఆంక్షలు విధించబడ్డాయి.
కేవలం పానీయాలపైనే కాదు, సోషల్ మీడియా వాడకంపై కూడా కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా, లేఓవర్ హోటళ్ల ఫొటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. కారణం— ఆధునిక ఏఐ టూల్స్ ద్వారా ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌ను విశ్లేషించి, హోటల్ లొకేషన్ బయటపడే ప్రమాదం ఉందని సంస్థ చెబుతోంది. ఇప్పటికే పోస్ట్ చేసిన హోటల్ కంటెంట్‌ను కూడా తొలగించాల్సిందేనని, లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, సిబ్బంది యూనిఫాంలో ఇంటి నుండి బయలుదేరి విధులకు రావడం, విధులు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడం కూడా నిషేధించారు. గతంలో కూడా యూనిఫాంలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. సంస్థ తన బ్రాండ్ ఇమేజ్, సిబ్బంది భద్రతను కాపాడేందుకే ఈ మార్పులు చేసినప్పటికీ, ఈ ఆంక్షలపై సిబ్బందిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.