ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ దిశగా అమరావతిలోని క్వాంటం వ్యాలీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం ద్వారా క్వాంటం కాంపోనెంట్ల టెస్టింగ్, క్యారెక్టరైజేషన్, బెంచ్‌మార్కింగ్ వంటి కీలక పరిశోధనలు జరగనున్నాయి.
ఇదే సమయంలో, ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్ మరో ప్రతిష్టాత్మక పెట్టుబడితో ముందుకొచ్చింది. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం క్రయోజనిక్ కాంపొనెంట్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ప్రకటించింది. ఈ ఫెసిలిటీ ద్వారా క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధి, పరికరాల తయారీ, పరిశోధనలకు పెద్ద సహకారం అందనుంది. దీని ద్వారా భారతీయ క్వాంటం కంప్యూటర్ తయారీ లక్ష్యం సాకారం కావడానికి కీలక బలమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం వ్యాలీ కేవలం ప్రయోగాలకే పరిమితం కాదని, దేశీయ క్వాంటం కంప్యూటర్ తయారీ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తుందని పేర్కొన్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుతో దేశీయ ఆవిష్కరణలకు కొత్త మార్గం ఏర్పడనుంది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్వదేశీ టెక్నాలజీతో క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధి సాధ్యమవుతుంది. IBM, TCS వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఇప్పటికే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది జనవరికి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి, భారత క్వాంటం సాంకేతికతకు కేంద్రబిందువుగా నిలవనుంది.