ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి పబ్లిక్ పరీక్షలను మార్చిలో కాకుండా, ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు ముందుగానే పూర్తవ్వడం వల్ల ఏప్రిల్‌లో తరగతులను ప్రారంభించే అవకాశం ఉంటుందని బోర్డు భావిస్తోంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక మార్పులు చేపట్టారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకే రోజులో రెండు సబ్జెక్టుల పరీక్షలు ఉండగా, ఇకపై రోజుకు ఒకే సబ్జెక్టుకు మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా మొదట సైన్స్ గ్రూప్ పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు జరగనున్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన సమయం దొరుకుతుందని బోర్డు భావిస్తోంది.
ఈ సంవత్సరం కొత్తగా 'ఎంబైపీసీ' గ్రూప్‌ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా, విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు. దీంతో ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాకపోవడంతో రోజుకు ఒకే పరీక్ష అనే విధానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ మార్పు విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరమవుతుందని అధికారులు చెబుతున్నారు.
అలాగే, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో పలు విద్యా సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ఇంటర్ సిలబస్‌ను పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ విధానానికి అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులకు 85 మార్కుల రాత పరీక్ష ఉండగా, మిగతా మార్కులు రెండో సంవత్సరంలో ప్రాక్టికల్స్ ద్వారా కేటాయిస్తారు. బయాలజీలో వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులతో విభజన చేయబడింది. అదనంగా, అన్ని పేపర్లలో ఒక మార్కు ప్రశ్నలను కొత్తగా చేర్చారు.
ప్రాక్టికల్ పరీక్షల విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. అవి జనవరి చివర్లో థియరీ పరీక్షల ముందు జరగాలా లేక థియరీ పరీక్షల తర్వాత పెట్టాలా అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. అయితే విద్యార్థుల భారం తగ్గిస్తూ, సబ్జెక్టు వారీగా సరైన సమయం ఇవ్వడమే ఈ కొత్త విధానం లక్ష్యమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు.