ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఇది 15వ భారత్–జపాన్ సమ్మిట్‌గా చరిత్రలో నిలిచింది. మోదీ టోక్యో చేరుకున్న కొద్ది గంటల్లోనే జరిగిన ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత వంటి కీలక రంగాలపై విస్తృతంగా చర్చించారు. ఇరువురు నేతలు ఈ భేటీ ద్వారా భారత్–జపాన్ సంబంధాలు మరింత బలపడుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మొత్తం 13 ముఖ్యమైన అవగాహన పత్రాలు మార్పిడి అయ్యాయి. వీటిలో రక్షణ సహకారం, మానవ వనరుల మార్పిడి, డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంయుక్త చర్యలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అనంతరం మోదీ, ఇషిబా సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జపాన్ ప్రధాని ఇషిబా, ఆరు సంవత్సరాల క్రితం వారణాసి చేసిన తన పర్యటనను గుర్తుచేసుకుని భారతీయ చరిత్ర, సంస్కృతి తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
మోదీ మాట్లాడుతూ, ఈ సమావేశం ఫలప్రదమైందని, రెండు దేశాల భాగస్వామ్యం కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వానికి కూడా ముఖ్యమని అన్నారు. రాబోయే 10 సంవత్సరాల కోసం ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని, ఇందులో పెట్టుబడులు, ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, మానవ వనరుల మార్పిడి వంటి అంశాలు కీలకమని వివరించారు.
ప్రత్యేకంగా, జపాన్ నుంచి భారత్‌లో రాబోయే దశాబ్దంలో 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్టు మోదీ ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌ల అభివృద్ధికి రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ కోసం జపాన్ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. అదేవిధంగా, కృత్రిమ మేధ (AI), సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ రంగాల్లో భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
ఈ సమ్మిట్‌లో చంద్రయాన్–5 మిషన్‌లో జపాన్ భాగస్వామ్యం, శుద్ధమైన హైడ్రోజన్, అమోనియా వినియోగం, సాంస్కృతిక మార్పిడి, పర్యావరణ సహకారం, ఖనిజ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. దీంతో భారత్–జపాన్ సంబంధాలు రాబోయే దశాబ్దానికి మరింత దృఢంగా, విస్తృతంగా మారనున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాలకే కాకుండా ప్రపంచానికి సానుకూల ప్రభావం చూపుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.