ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో మామిడి ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల కోసం ప్రభుత్వం రూ.185.02 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు మొత్తం 40,795 మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయబడ్డాయి. రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాల వారీగా కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు ఈ చెల్లింపులు చేపట్టారని చెప్పారు. ఈ చర్యతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంవత్సరం మామిడి సీజన్‌లో తోతాపురి రకం మామిడి ధరలు భారీగా తగ్గిపోయాయి. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.4,000 పెట్టుబడి సాయం ప్రకటించింది. ప్రభుత్వం ఈ సాయాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme - MIS) కింద ప్రకటించగా, రైతులు కొంతకాలంగా ఈ నిధులు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు వారి అకౌంట్లలో జమ కావడంతో రైతులలో ఆనందం నెలకొంది.
మామిడి రైతులకు సహాయంగా ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించింది. కిలోకు రూ.4 అదనంగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయంతో రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం వ్యయాన్ని భరిస్తుంది. ఈ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి తోతాపురి మామిడిని కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చారు.
కేంద్రం ఈ స్కీమ్ కింద రూ.130 కోట్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భవిష్యత్తులో కూడా తోతాపురి మామిడి ధరలు పడిపోయినప్పుడు రైతులకు ఈ పథకం ద్వారా అండగా నిలవడానికి అవకాశం లభిస్తుంది. ఇది రైతుల ఆర్థిక భద్రతకు దోహదపడే నిర్ణయమని అధికారులు పేర్కొన్నారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2025–26 సీజన్‌కు గాను ధరల లోపం చెల్లింపు (Price Deficiency Payment - PDP)ను కేంద్రం ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేయనున్నారు. క్వింటాల్‌కు రూ.1,490.73 మద్దతు ధర నిర్ణయించారు. ఈ చర్య మామిడి రైతుల ఆదాయాన్ని కాపాడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.