తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన వార్త… చలికాలం దగ్గర పడుతున్న సమయంలో, రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (అక్టోబర్ 14) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా నగరవాసులు, జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా వాతావరణ శాఖ సూచనలతో పాటు, తన కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన 'తెలంగాణ వెదర్‌మ్యాన్' కూడా రాష్ట్రంలో వర్షాలపై కీలకమైన అంచనా వేశారు.
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఆయన పేర్కొన్నారు. బయటకు వెళ్లేవారు కచ్చితంగా గొడుగులు, రెయిన్ కోట్లు తీసుకెళ్లడం మంచిది. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగామ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా రైతులు తమ ధాన్యాన్ని, పంటలను కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ తన నివేదికలో హైదరాబాద్‌లో ఈ వర్షాలు శుక్రవారం (అక్టోబర్ 17) వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వానల వల్ల నగరవాసులకు ఒక రకంగా ఉపశమనమే దొరకనుంది.
ఈ వర్షాల కారణంగా నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 24.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో 28.5 డిగ్రీలుగా నమోదైంది.
వర్ష సూచన నేపథ్యంలో నగరవాసులు, ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
నగరవాసులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆఫీసులకు వెళ్లేవారు లేదా ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందుగానే బయలుదేరడం శ్రేయస్కరం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.