దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ రైళ్లు వేగం, సౌకర్యం, ఆధునికతలో కొత్త దిశ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ వందే భారత్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా రైళ్ల నిర్వహణను మెరుగుపరచేందుకు కొత్త డిపోలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో రూ.300 కోట్లతో వందే భారత్ రైళ్లకు ప్రత్యేక మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, దుర్గ్, భువనేశ్వర్ వంటి నగరాలకు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ పనులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు నిర్వహణను విశాఖపట్నం కోచ్ డిపోలో చేస్తున్నారు. కానీ కొత్త డిపో ఏర్పడితే, అన్ని రైళ్ల నిర్వహణను ఒకే చోట పూర్తి చేయడం సులభతరం అవుతుంది. దీంతో సమయపాలన మెరుగుపడి, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
మర్రిపాలెంలో ఏర్పాటు చేయనున్న ఈ డిపోకు అవసరమైన భూమి ఇప్పటికే అందుబాటులో ఉందని సమాచారం. డిపోలో ‘పిట్ లైన్’ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల సిబ్బంది రైలుకు కిందకు దిగి మరమ్మతులు సులభంగా చేయగలరు. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్ల నిర్వహణకు అధిక సమయం, ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఈ కారణంగా విశాఖపట్నం డిపో నిర్మాణం అత్యవసరమైందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం ఇప్పటికే వందే భారత్ జోనల్ కేంద్రంగా మారుతోంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతికి కూడా త్వరలో ఒక వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ఇది ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఇకపోతే, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిపోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ డిపోలు ఏర్పడితే దక్షిణ భారతదేశంలోని వందే భారత్ రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోబోతున్న విశాఖ డిపో రాష్ట్రానికి భారీ లాభాలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.