ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతుల దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయ సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్ వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ పరిశీలన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ శనివారం దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. మొత్తం పది మంది మంత్రులతో కూడిన ఈ సబ్‌కమిటీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు అమలు చేసే విధానంపై సమీక్ష చేయనుంది.
ఉపసంఘం ముఖ్యంగా మధ్యస్థ (ఇంటర్‌మీడియేట్) స్థాయి పోస్టులను సృష్టించడం, వాటికి తగిన పే స్కేల్స్ నిర్ణయించడం, అలాగే ఖాళీల భర్తీ విధానం వంటి అంశాలపై పరిశీలన జరిపి తుది సిఫార్సులు సిద్ధం చేయనుంది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సచివాలయ సిబ్బంది కెరీర్ పురోగతికి కొత్త మార్గం సుగమం కానుంది.
ఇదివరకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తి చేసింది. మే 31 నాటికి ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేసింది. అంధులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన వారు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, 40 శాతం పైగా వైకల్యంతో బాధపడేవారు, కారుణ్య నియామకాల కింద ఉన్నవారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది.
భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయాల్లో పనిచేస్తే, వారిలో ఒకరికి దగ్గర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది ఉద్యోగుల కుటుంబ జీవన సమతుల్యానికి ఎంతో ఉపయోగపడే నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడం, సచివాలయ సిబ్బందిలో ఉత్సాహం నింపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, వేలాది మంది ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభించనున్నాయి.
సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజా సేవలను సమర్థంగా అందించడంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాంటి కీలక సిబ్బందికి ప్రమోషన్ వ్యవస్థ ఏర్పడటం, ఉద్యోగుల్లో నిబద్ధత, పనితీరు మరింత మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.