ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై తీవ్రంగా స్పందించారు. అటవీశాఖ సిబ్బందితో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి జరిగిన వివాదంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడిన అనంతరం, ఉద్యోగులపై దాడి చేసిన వ్యవహారంలో ఎమ్మెల్యే వైఖరి పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదాలకు తావివ్వడం సరికాదని అసంతృప్తి వెలిబుచ్చారు. తప్పు ఎవరిదైనా సరే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అటవీ అధికారులపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అటవీ అధికారులు నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు.
ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో దోర్నాల-శ్రీశైలం రహదారిపై చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో, రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న అటవీ అధికారులు, ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే బుడ్డా స్వయంగా అటవీ అధికారులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామ నాయక్, డ్రైవర్ కరీం, గార్డ్ గురవయ్యతో పాటు మరో గార్డుపైనా అనుచరులు దాడికి పాల్పడ్డారు.
అంతటితో ఆగకుండా, అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే నడుపుతూ, నలుగురిని అందులో ఎక్కించుకుని శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అక్కడ వారి వాకీటాకీలు, సెల్‌ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను లాక్కొని, గంటల పాటు నిర్బంధించి చితకబాదారు. ఈ దాడిలో బాధితులందరూ ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. బాధితులు ఈ విషయాన్ని మార్కాపురం డీఎఫ్‌ఓ దృష్టికి తీసుకెళ్లి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో దళితులు ఉండటంతో, దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.