మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రతన్ టాటాను "భరత జాతి ముద్దుబిడ్డ"గా అభివర్ణించిన ఆయన, దేశ అభివృద్ధి కోసం రతన్ టాటా చేసిన కృషిని గుర్తుచేశారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి దిశగా రతన్ టాటా తన సూచనలు పంచుకున్నారని, సంపాదించిన సంపదను సమాజానికి తిరిగి ఇచ్చే మహోన్నత గుణం ఆయనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచేందుకు ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించామని తెలిపారు.
"గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశాను, ఇకపై ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే నా నినాదం" అని సీఎం అన్నారు. సరైన ప్రభుత్వ విధానాలతోనే ఆదాయం, సంతృప్తి వస్తాయని, భవిష్యత్తు అంతా ఐటీ రంగానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత దశాబ్దంలో దేశం 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ నుంచి నాలుగో స్థానానికి ఎదిగిందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
"ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. సంపద సృష్టించడంతో పాటు పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రతన్ టాటా నిరాడంబరత, సమాజసేవ అందరికీ ఆదర్శం. అందుకే ఆయన పేరుతో ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభించాం" అని పేర్కొన్నారు. తన కుటుంబం నుంచి భువనేశ్వరి, బ్రహ్మణి వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారని, ఇక అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.