పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన బూరుగపల్లి రామకృష్ణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ పట్టణ పరిధిలో 15వ బ్లాకులో 578.66 గజాల స్థలాన్ని 2012లో రిజిస్ట్రేషన్ నంబర్లు 8840/2012, 8657/2012 ద్వారా కొనుగోలు చేశాను. ఆస్తిలో భాగంగా 2014–2015లో బైరా శేషయ్య, మెట్టు శేషగిరిబాబు, గట్టా పూర్ణచంద్రరావుల వద్ద తనఖాగా పెట్టి అప్పు తీసుకున్నాను. అప్పు తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు అధిక వడ్డీ కోరారు.
ఆ వివాదం కారణంగా మాజీ మంత్రి విడదల రజిని మామ విడదల లక్ష్మీనారాయణ, గ్రంధి ఆంజనేయులు, తోట బ్రహ్మస్వాములు ప్రభావంతో తోట వెంకటరత్నం నాయుడు పేరుమీద 2016లో బలవంతంగా జనరల్ పవర్ అఫ్ అటార్నీ వ్రాయించారు. దీనికి సంబంధించిన ఎటువంటి చెల్లింపు తనకు జరగలేదు. పైగా పూర్ణచంద్రరావుకు ఇవ్వాలని చెప్పి రూ. 8 లక్షలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు తన ఆస్తి హక్కులు తిరిగి రాలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
కృష్ణా జిల్లా గూడూరు మండలం లేళ్లగరువు గ్రామానికి చెందిన పుప్పాల వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 722లో 34 సెంట్ల భూమి ఉంది. తమ బంధువులైన పుప్పాల నాగభూషణం, అతని కుమారుడు పుప్పాల హరికిరణ్ లకు తమ భూమిని కౌలుకు ఇచ్చాం. తమ తెలియకుండా వారు అధికారులతో కలిసి సర్వే చేయించుకోని భూమిని ఆన్‌లైన్‌లో ఇతరుల పేరుపై మార్చి మాస పద్మావతి పేరుతో విక్రయించారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు.
చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమందా గ్రామానికి చెందిన ఎం. ఈశ్వరయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 457/8లో 1.19 సెంట్లు భూమి ఉండగా, రీసర్వేలో 0.99 సెంట్లుగా చూపించారు. రీసర్వేలో తగ్గిన భూమిని ఎం. నాగరాజు వైసీపీ బూత్ ఎజెంట్ గా పనిచేస్తూ గత ప్రభుత్వంలో భూమిని కబ్జా చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా తమనే అడ్డుకుంటున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు.
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం నెలటూరు గ్రామానికి ఈదర సావిత్రి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తాళ్ళూరి శ్రీనివాస్ అనే బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, అమ్మమ్మ అయినా తన సంరక్షణలో జీవిస్తున్నాడు. నెలటూరు గ్రామంలో తన మనవడికి సంబంధించి 110చ.గ. ఆస్తి ఉంది. తమ ఇల్లు ఎదురుగా భార్యభర్తలు అయినా తాళ్ళూరి రమేష్, తాళ్ళూరి సమంత ఉన్నారు. వీరు ప్రతి రోజు ఆస్తి అమ్మలాని వేధిస్తున్నారు. అమ్మకపోతే తమ మనవడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రాణ భయంతో ఆ ఇంటికి తాళం వేసి చాగల్లులో నివాసం ఉంటున్నాం. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన ఎన్. జనార్ధన్ రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..మంగుంట గ్రామం నుండి దిగువ మంగుంట గ్రామానికి సుమారు రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు, కల్వర్ట్, రివెట్‌మెంట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించగా, వైసీపీ జడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రహదారిని తమ భూముల వరకు మాత్రమే వేసుకుని, దిగువ మంగుంట గ్రామానికి చేరకముందే సుమారు 50 అడుగుల దూరంలో రోడ్డు నిలిపివేశారు.
ఈ అంశంపై గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే గ్రామానికి ఇప్పటికే మూడు రోడ్లు ఉన్నాయి. 4వ రోడ్డు అవసరం లేదన్నారు. జడ్పీ ఫండ్స్ ద్వారా రోడ్డు వేసి తన కోడలు సర్పంచ్ బి.రూప ద్వారా గ్రామసభ ఆమోదం పొంది. తన భార్య టీ. సరస్వతి ద్వారా కాంట్రాక్టర్లలకు బిల్లులు వచ్చిన తర్వాత రోడ్డును నిలిపివేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదు. కావునా దీనిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించాడు.