సింగపూర్తో రాజధాని అమరావతి నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి
ఉండకూడదని తన పర్యటనలో కొన్ని రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu).. భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేకు స్పష్టం చేశారు. 
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు. సింగపూర్లోని భారత హైకమిషనర్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులు లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్తో తో పాటు ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలెక్కాయని తెలిపారు. ఇండియా క్వాంటం మిషన్లో భాగంగా క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందన్న చంద్రబాబు.. డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలని, వాటికి ఏపీ గేట్ వేగా ఉంటుందని స్పష్టంచేశారు.
సింగపూర్ లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ అని హైకమిషనర్ వివరించారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారన్ని అందించాలని కోరారు.
విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి లోకేశ్ వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే తెలిపారు. భారత్లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని హైకమిషనర్ వ్యాఖ్యానించారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        