మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ఆధ్యాత్మికత, పవిత్రతను కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. "అమరావతి, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని, యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గోవిందుడిని వేడుకున్నాను.
ఆయన ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నిండి, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. 25 ఏళ్ల చరిత్రలో మెదటిసారి జులైలో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు విడుదల చేశాం. హంద్రీ-నీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, నీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తాం.
రాబోయే రోజుల్లో బాలాజీ రిజర్వాయర్ ద్వారా తిరుమలకు కృష్ణా జలాలు తెస్తాం.. భక్తుల దాహార్తిని తీరుస్తాం. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఉండాలి" అని నిమ్మల రామానాయుడు అన్నారు.
 
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        