ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సేవలందించడంలో మరో అడుగు ముందుకేసింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ... ఇప్పుడు ఆస్తి రిజిస్ట్రేషన్ అనంతరం ఒరిజినల్ డాక్యుమెంట్‌ను నేరుగా కొనుగోలుదారుడి వాట్సాప్ నంబర్‌కి పంపించే కొత్త సేవను ప్రారంభించింది. ఈ కొత్త విధానం విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ అనంతరం రైటర్లు సాయంత్రం వేళ డాక్యుమెంట్లు తీసుకెళ్లి, వీలైనప్పుడు కొనుగోలుదారులకు అందించేవారు. కానీ ఇకపై అలాంటి తలనొప్పి లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నిర్ణయం ప్రకారం, రిజిస్ట్రేషన్ పూర్తయ్యగానే డాక్యుమెంట్‌ను వాట్సాప్ ద్వారా పంపే విధంగా కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు.
రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుడి మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో సరిపోల్చి, సరిగా ఉన్నట్లు తేలితే... డాక్యుమెంట్ స్కాన్ చేసి వాట్సాప్‌కి పంపిస్తారు. తదుపరి బాయోమెట్రిక్ వాలిడేషన్ కోసం కొనుగోలుదారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అయితే ఇకపై డాక్యుమెంట్‌ను రైటర్ల చేతుల్లో ఉంచే అవసరం లేదు.
విశాఖ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ మాట్లాడుతూ, "ఈ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఎవరి డాక్యుమెంట్ వారికే చేరుతుంది. ఎవరూ ఇతరుల సమాచారం చూడలేరు" అని వివరించారు.
ప్రస్తుతం ఏపీలో వాట్సాప్ ద్వారా అందుతున్న సేవల సంఖ్య 300కి చేరింది. ఇందులో బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా చేరటం మరో ముందడుగు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        