Iconic Towers Amaravati: అమరావతిలో వేగంగా ఐకానిక్ టవర్ల నిర్మాణం.. హెచ్‌వోడీ టవర్-3 పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ..!!
Iconic Towers Amaravati: అమరావతిలో హెచ్‌వోడీ టవర్-3 పనులు ప్రారంభమయ్యాయి. డయాగ్రిడ్ టెక్నాలజీతో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఇటీవలి అగ్నిప్రమాదంపై మంత్రి నారాయణ చేసిన కీలక వ్యాఖ్యలు.
Political:వేగంగా కదులుతున్న ఐకానిక్ టవర్లు
ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు
అగ్నిప్రమాదంపై సీరియస్ విచారణ
Amaravati Construction Updates: రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెచ్‌వోడీ (HOD) టవర్-3 నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ భవనానికి సంబంధించి కార్నర్ నోడ్ అమర్చే పనులను అధికారులు ప్రారంభించారు. అత్యాధునికమైన డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈ ఐదు టవర్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండి పాలన సాగించేలా, సచివాలయానికి అనుబంధంగా ఈ ఐకానిక్ భవనాలను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపు నాలుగు నెలల పాటు పనులకు ఆటంకం కలిగినప్పటికీ, ఇప్పుడు పనులు మళ్లీ ఊపందుకున్నాయని పేర్కొన్నారు.
కేవలం కార్యాలయాలే కాకుండా, ప్రజాప్రతినిధులు అధికారుల నివాస సముదాయాల పనులు కూడా తుది దశకు చేరుకుంటున్నాయి. అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు అన్ని రకాల కనీస సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని వివరించారు. ఈ ఐకానిక్ భవనాలు అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక వనరులపై వస్తున్న విమర్శలను మంత్రి నారాయణ తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక ఫైనాన్స్ మోడల్‌ను రూపొందించారని, దీనివల్ల సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతి కోసం ఖర్చు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, తన వనరులను తానే సృష్టించుకునే సామర్థ్యం ఈ నగరానికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల అమరావతి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదానికి పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధాని పనులకు ఆటంకం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
Be the first to react