అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసే సంచలన ప్రకటన చేశారు. తన స్వంత సోషల్ మీడియా వేదిక "ట్రూత్ సోషల్" ద్వారా సోమవారం ఆయన ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై అమెరికా వెలుపల చిత్రీకరించే ఏ సినిమాపైనైనా 100 శాతం సుంకం (టారిఫ్) విధించనున్నట్లు స్పష్టం చేశారు. అంటే అమెరికాలో విడుదల కావడానికి, అక్కడ ప్రదర్శింపబడటానికి వచ్చే ప్రతి విదేశీ సినిమాకు ఈ భారీ పన్ను తప్పనిసరి అవుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే హాలీవుడ్ సహా అంతర్జాతీయ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి.
ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలను ట్రంప్ తన పోస్టులో వివరించారు. "మన సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకున్నాయి. పసిపిల్లల నుంచి మిఠాయిని దొంగిలించినంత ఈజీగా వారు మన పరిశ్రమను దెబ్బతీశారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రం ఈ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిందని ట్రంప్ ఆరోపించారు. "బలహీనమైన, అసమర్థ గవర్నర్ పాలనలో ఉన్న కాలిఫోర్నియా కారణంగానే ఇది మరింత తీవ్రంగా మారింది" అని ఆయన పేర్కొన్నారు. అమెరికా సినీ పరిశ్రమను కాపాడడమే ఈ కఠిన నిర్ణయానికి కారణమని ఆయన నొక్కి చెప్పారు.
విదేశీ సినిమాలపై ట్రంప్ కఠిన వైఖరి కొత్తది కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2025 మే నెలలోనే విదేశీ సినిమాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ ప్రొడక్షన్లు అమెరికన్ ఫిల్మ్ మేకర్లను తమ దేశాలకు ఆకర్షిస్తూ, వారి చిత్రాలలోకి తమ భావజాలాన్ని, ప్రచారాన్ని చొప్పిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఈ 100 శాతం సుంకం విధించడంతో తన ఆ వైఖరిని మరింత బలపరిచినట్టే కనిపిస్తోంది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే అంతర్జాతీయ సినీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో విడుదల అవుతున్న విదేశీ సినిమాలు ఇప్పుడు రెట్టింపు ఖర్చుతో మాత్రమే ప్రేక్షకులను చేరతాయి. దీని వల్ల అమెరికన్ ప్రేక్షకులు విదేశీ సినిమాల నుండి దూరం కావచ్చు. మరోవైపు హాలీవుడ్ స్థానిక పరిశ్రమకు ఇది కొంత బలాన్నిచ్చే అవకాశం ఉన్నా, అంతర్జాతీయ సహకారాలు, క్రాస్-కల్చరల్ ప్రాజెక్టులు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ సినీ మార్కెట్‌లో కొత్త మార్పులు, కుదుపులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.