రైతుల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో ఎఫ్‌సీఐ (Food Corporation of India) ఈసారి పెద్ద ఎత్తున ధాన్యం సేకరించేందుకు సిద్ధమైంది. గత ఏడాది కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఈసారి 30 లక్షల టన్నులు సేకరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
ఎఫ్‌సీఐ అధ్యక్షుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతుల చెమట చిందించిన ప్రతి గింజను సురక్షితంగా నిల్వ చేసేలా కొత్త గోదాములు నిర్మిస్తాం అన్నారు. ధాన్యం నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా స్థిరమైన నిల్వ వ్యవస్థ లభిస్తుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన గోదాముల నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ గోదాములు ధాన్యం నిల్వ మాత్రమే కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా కూడా ఉపయోగపడనున్నాయి.
ఇప్పటికే ఉన్న ఎఫ్‌సీఐ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధమైందని ఎంపీ తెలిపారు. దీని ద్వారా 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అన్నారు. ఇది గోదాముల నిర్వహణ ఖర్చును తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది.
రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. రైతులకు సమయానికి చెల్లింపులు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ లావు తెలిపారు.
గత రబీ సీజన్‌లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి మరింత పెంచేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేకరణ కేంద్రాల్లో సులభమైన విధానాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణం పూర్తయితే ఎఫ్‌సీఐ నిల్వ సామర్థ్యం విస్తరించనుంది. భవిష్యత్తులో ప్రతి జిల్లాలో ఒక ఆధునిక నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం లక్ష్యమని ఎంపీ చెప్పారు.ఇక ధాన్యం నిల్వ రవాణా సేకరణ ప్రక్రియలన్నీ డిజిటల్ విధానంలో జరుగనున్నాయి. దీంతో ధాన్యం నాణ్యతను పర్యవేక్షించడం సులభమవుతుందని తెలిపారు.