Indian Army: రక్షణ రంగంలో తగ్గేదేలే... ప్రపంచంలోనే నాల్గవ మహాశక్తిగా నిలిచిన భారత సైన్యం!

Indian Army: గ్లోబల్ ఫైర్పవర్ విడుదల చేసిన ‘మిలిటరీ స్ట్రెంత్ ఇండెక్స్ 2026’ నివేదికలో ప్రపంచంలోని 145 దేశాలలో భారతదేశం అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యంతో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, రష్యా, చైనాలు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 14 లక్షలకు పైగా యాక్టివ్ సైనికులు, స్వదేశీ ఆయుధ సంపత్తి, క్షిపణి వ్యవస్థల బలం భారత్ను టాప్ లీగ్లో నిలబెట్టగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ సైనిక పరంగా 14వ స్థానానికి పడిపోయింది.

రక్షణ రంగంలో తగ్గేదేలే.
రక్షణ రంగంలో తగ్గేదేలే.
  • గ్లోబల్ మిలిటరీ ఇండెక్స్ 2026:  గ్లోబల్ ఫైర్పవర్ సూచీలో టాప్-4లో భారత్ అజేయ ప్రస్థానం

  • అమెరికా, రష్యా, చైనాలదే తొలి మూడు స్థానాలు.. పాకిస్తాన్కు భారీ షాక్, 14వ ర్యాంకుకు పతనం

  • 60కి పైగా అంశాలతో నివేదిక: ‘ఆత్మనిర్భర్’ శక్తే భారత సైన్యానికి కొండంత బలమన్న నిపుణులు

Indian Army: ప్రపంచ దేశాల సైనిక పటిమ, రక్షణ రంగా సామర్థ్యాలను అంచనా వేసే 'గ్లోబల్ ఫైర్పవర్ మిలిటరీ స్ట్రెంత్ ఇండెక్స్ 2026' (Global Firepower Index) నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 145 దేశాల సైనిక విభాగాలను క్షుణ్ణంగా విశ్లేషించి ఈ ర్యాంకులను ప్రకటించారు. కేవలం సైనికులు లేదా ఆయుధాల సంఖ్య మాత్రమే కాకుండా సాంకేతికత, రక్షణ బడ్జెట్, లాజిస్టిక్స్ సామర్థ్యం, భౌగోళిక వ్యూహాలు వంటి దాదాపు 60కి పైగా విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు. ఈ తాజా అంతర్జాతీయ నివేదికలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలగాలలో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ గ్లోబల్ మిలిటరీ ఇండెక్స్లో సుమారు 895 బిలియన్ డాలర్ల భారీ రక్షణ వ్యయంతో అమెరికా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలు, అంతరిక్ష రక్షణ రంగాలు మరియు సైబర్ వ్యూహాలలో అమెరికాకు తిరుగులేదని నివేదిక స్పష్టం చేసింది. ఇక ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఉన్నప్పటికీ, రష్యా తన భారీ అణు సంపత్తి మరియు అత్యంత బలమైన ట్యాంకుల బలగంతో ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన మిలిటరీగా నిలిచింది. పారిశ్రామిక వేగం, ఆర్థిక బలం మరియు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విస్తరణతో చైనా మూడవ స్థానంలో నిలిచి అగ్రరాజ్యాలకు గట్టి పోటీనిస్తోంది.

ప్రపంచ రక్షణ రంగంలో దూసుకుపోతున్న భారతదేశం 0.1346 పవర్ ఇండెక్స్ స్కోరుతో నాల్గవ స్థానాన్ని మరింత భద్రం చేసుకుంది. సుమారు 1.4 మిలియన్ల (14 లక్షలకు పైగా) క్రియాశీల సైనిక బలగాలు, బలమైన నౌకాదళం మన దేశానికి ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుకుంటూ, దేశీయంగా రక్షణ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తోంది. తేజస్ స్వదేశీ యుద్ధ విమానాలు, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు మరియు స్వదేశీ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ భారత రక్షణ సన్నద్ధతను సరికొత్త శిఖరాలకు చేర్చాయని నివేదిక కొనియాడింది. మన దేశం సమగ్ర రక్షణ వ్యయం పరంగా కూడా గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది.

ఈ తాజా ర్యాంకింగ్స్లో భారతదేశం తర్వాత స్థానాలలో దక్షిణ కొరియా (5వ ర్యాంక్), ఫ్రాన్స్ (6వ ర్యాంక్), జపాన్ (7వ ర్యాంక్), యునైటెడ్ కింగ్డమ్ (8వ ర్యాంక్), టర్కీ (9వ ర్యాంక్) మరియు ఇటలీ (10వ ర్యాంక్) నిలిచాయి. కాగా, తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగు దేశం పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాల్లో క్రమంగా వెనుకబడుతూ 2024లో 9వ స్థానం నుండి, గత ఏడాది 12వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం. జర్మనీ దేశం రక్షణ రంగంలో వేగంగా సంస్కరణలు చేపట్టి 12వ స్థానానికి ఎగబాకింది.

ప్రస్తుత ఆధునిక కాలంలో యుద్ధ తంత్రం కేవలం సరిహద్దులకే పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో మిలిటరీ ఆధిపత్యం కేవలం సాంప్రదాయ బలగాల మీద కాకుండా కృత్రిమ మేధస్సు (AI), స్వయంప్రతిపత్త ఆయుధాల విప్లవం మీద ఆధారపడి ఉంటుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మారుతున్న గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా భారత్ ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో రక్షణ సాంకేతికతలో ముందంజ వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

Be the first to react

Latest