అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ వేడుకలు సాధారణంగా టర్కీ, స్టఫింగ్, మాష్డ్ పొటాటోస్ వంటి సంప్రదాయ వంటకాలతో జరుపుకుంటారు. కానీ ఈసారి ఒక అమెరికన్ యువకుడు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో మాత్రం ఈ పండుగకు పూర్తిగా భారతీయ రంగులు అద్దింది. ‘ఎప్పుడైనా ఇండియన్ థ్యాంక్స్‌గివింగ్ చూసారా?’ అనే శీర్షికతో కానర్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన భార్య భారతీయురాలు కావడంతో, వారి కుటుంబం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలతో ఈ వేడుకను జరుపుకున్నట్లు అతను తెలిపాడు.
వీడియోలో కనిపించిన వంటకాలు అంతా భారతీయ రుచులతో నిండి ఉన్నాయి. బ్రెడ్ రోల్స్ స్థానంలో సమోసాలు, టర్కీ స్థానంలో చికెన్ తిక్కా మసాలా, గ్రీన్ బీన్స్‌కు బదులుగా చనాగారెలు, సంప్రదాయ స్టఫింగ్‌కి బదులుగా చికెన్ బిర్యానీ… ఇలా మొత్తం టేబుల్‌పై కనిపించింది భారతీయ వంటకాల ఘుమఘుమలమే అని కానర్ నవ్వుతూ చెప్పాడు. అమెరికన్ పండుగను భారతీయ రుచులతో కలిపిన ఈ ప్రత్యేక వేడుక చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇప్పటికే 3.7 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. చాలా మంది ఇది సాంస్కృతిక కలయికకు అద్భుతమైన ఉదాహరణ అని కామెంట్ చేశారు. "ఇండియన్ థ్యాంక్స్‌గివింగ్ అంటే ఇదే కదా అసలు పండుగ!" అని ఒకరు స్పందించగా, "ఇదే నిజమైన స్ప్రెడ్… ప్రతి వంటకం రుచికరంగా కనిపిస్తోంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు. కొందరు తమను కూడా వచ్చే సంవత్సరం ఆహ్వానించమని సరదాగా కోరుతూ కామెంట్లు పెట్టారు.
అమెరికాలో 1621లో వాంపనోగ్ గిరిజనులు మరియు ఇంగ్లీషు వలసదారులు కలిసి జరుపుకున్న పంట పండుగ నుండి థ్యాంక్స్‌గివింగ్ సంప్రదాయం ప్రారంభమైంది. 1863లో అధ్యక్షుడు అబ్రహం లింకన్ దీన్ని జాతీయ పండుగగా ప్రకటించారు. కుటుంబాలు, స్నేహితులు కలిసి భోజనం చేసుకునే పండుగలో మేసీ పరేడ్, టర్కీ పర్డన్, సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యాంశాలుగా నిలుస్తాయి.
ఈ నేపధ్యంలో భారతీయ వంటకాలతో అలుముకున్న కానర్ కుటుంబం థ్యాంక్స్‌గివింగ్ వేడుక సాంస్కృతిక అనుబంధానికి, కుటుంబ ప్రేమకు ప్రతీకగా నిలిచిందని సోషల్ మీడియాలో చాలామంది అభినందిస్తున్నారు.