నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలు కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకునే అవకాశం కల్పించినట్లైంది.
అలాగే బార్లకు ప్రత్యేక సడలింపు ఇచ్చింది. సాధారణ బార్లు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే లైసెన్సులు, ఇన్-హౌస్ లైసెన్సులు మరియు ఈవెంట్ పర్మిట్ లైసెన్సులు కలిగిన యూనిట్లకు మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి లభించింది.
ఈ సడలింపులు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యాటకులు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేయగా, ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మద్యం షాపుల యజమానులు కూడా ఈ సడలింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమయాల పొడిగింపుతో పాటు అన్ని లైసెన్సు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేలా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, నియమ నిబంధనలకు లోబడి సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.