అమరావతి రాజధానికి దీటుగా విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, నగరానికి కీలక ద్వారంగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో ఆధునీకరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.661.11 కోట్ల నిధులు మంజూరు చేయడంతో, రైల్వే యంత్రాంగం వేగంగా ముందడుగు వేసింది. స్టేషన్ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ప్రతిపాదనలకు అధికారికంగా శ్రీకారం చుట్టింది.
మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చేపట్టిన ఆధునిక రైల్వే స్టేషన్ అభివృద్ధి నమూనాలను అనుసరించి, అమరావతి రాజధానికి అతి సమీపంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్‌ను రైల్వే అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 83,367 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ అభివృద్ధి చేపట్టనుండగా, వ్యాపార సముదాయాలు, స్టాల్స్, హోటళ్లు, రైల్వే క్వార్టర్లు, స్టేషన్ కార్యాలయాలు వంటి సదుపాయాలను 81,948 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించనున్నారు. తూర్పు, పడమర వైపులా విజయవాడ నగరానికి ఆకర్షణగా నిలిచేలా స్టేషన్‌ను డిజైన్ చేయనున్నారు.
తూర్పు ముఖద్వారాన్ని పార్లమెంట్ ముఖద్వారానికి దీటుగా, సూపర్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా రూపొందించేందుకు ఇప్పటికే ప్రత్యేక నమూనాలను సిద్ధం చేశారు. మరోవైపు పడమర వైపు ఉన్న వన్‌టౌన్ ప్రాంతం వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన నేపథ్యంలో, అక్కడ కూడా వ్యాపారులకు అనుకూలంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. రెండు నుంచి మూడు అంతస్తుల వరకూ కమర్షియల్ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ, రైళ్ల సంఖ్యతో పాటు ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అదనపు సదుపాయాల అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించారు.
ఇదిలా ఉండగా, రైల్వే స్టేషన్ తూర్పు వైపు ఉన్న సిటీ బస్టాండ్, స్కూటర్ పార్కింగ్ ప్రాంతం నుంచి టవర్ క్లాక్ వరకు పరిసర ప్రాంతాలన్నింటిలోనూ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో స్టేషన్‌కు చెందిన 41.70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్–2 భవనం నిర్మించనున్నారు. అలాగే పడమర వైపు 6,647 చదరపు మీటర్ల పరిధిలో జీ ప్లస్–2 భవనాలు నిర్మించే ప్రణాళిక ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో రైల్వే అధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. తూర్పు వైపు అభివృద్ధికి పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉండగా, పడమర వైపు గాంధీ హిల్ కొండ ప్రాంతంలో ఉన్న కొంత భూమిని స్టేషన్ అభివృద్ధికి కేటాయించాలనే ప్రతిపాదనలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ రైల్వే స్టేషన్ రాష్ట్రానికే ఒక మైలురాయిగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.