భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి టాటా మోటార్స్ మరో ఘనతను జోడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి అని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేస్తోంది. ఒకప్పుడు ఈవీలు ప్రయోగ దశలోనే ఉన్నాయన్న అభిప్రాయం ఉండగా, ఇప్పుడు అవి సాధారణ వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ మార్పుకు టాటా మోటార్స్ ప్రధాన కారకంగా నిలిచింది.
2020లో దేశంలోనే తొలి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారుగా నెక్సాన్.evను విడుదల చేసిన టాటా, ఆ తర్వాత ఈవీ విభాగంలో వేగంగా విస్తరించింది. నెక్సాన్.ev ఒక్కటే లక్షకు పైగా అమ్మకాలు సాధించి, భారత్‌లో అత్యధికంగా విక్రయమైన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది. దీని విజయంతో వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం పెరిగింది. ఫలితంగా టాటా తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.
ప్రస్తుతం భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల్లో సుమారు 66 శాతం మార్కెట్ షేర్ టాటా మోటార్స్‌దే. అంటే రోడ్లపై కనిపించే ప్రతి మూడు ఈవీల్లో రెండు టాటా వాహనాలేనన్న మాట. టియాగో.ev, పంచ్.ev, నెక్సాన్.ev, కర్వ్.ev, హారియర్.ev వంటి మోడళ్లతో అన్ని ధరల శ్రేణుల్లో వినియోగదారుల అవసరాలను టాటా తీరుస్తోంది. అంతేకాదు, ట్రావెల్ ఏజెన్సీలు, కమర్షియల్ వినియోగం కోసం XPRES-T EVను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ & సీఈఓ శైలేశ్ చంద్ర మాట్లాడుతూ, “ఇది కేవలం కార్ల అమ్మకాల విజయం కాదు. భారతదేశం స్వచ్ఛమైన మొబిలిటీ వైపు అడుగులు వేస్తోందనేందుకు ఇది నిదర్శనం” అని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న చార్జింగ్ మౌలిక వసతులు, వినియోగదారుల విశ్వాసం కలిసి ఈ విజయానికి దోహదం చేశాయని తెలిపారు. చార్జింగ్ రంగంలోనూ టాటా ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా చార్జింగ్ పాయింట్లకు యాక్సెస్ కల్పించడంతో పాటు, ప్రధాన నగరాలు, జాతీయ రహదారులపై ఇప్పటికే 100 మెగా ఫాస్ట్ ఛార్జింగ్ హబ్‌లు పనిచేస్తున్నాయి.