అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లే వారికి భారీ ప్రోత్సాహకాలు అందించనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికాను విడిచి వెళ్లే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2.7 లక్షలు) నగదుతో పాటు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు డిసెంబర్ 22న వెల్లడించింది. అక్రమ వలస సమస్యను మానవీయంగా, కానీ కఠినంగా పరిష్కరించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని DHS స్పష్టం చేసింది.
ఈ పథకంలో చేరే వలసదారులకు మరో కీలక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాను విడిచి వెళ్లకపోవడం వల్ల ఇప్పటివరకు విధించిన సివిల్ జరిమానాలను పూర్తిగా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ‘CBP Home’ అనే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వలసదారులు యాప్‌లో నమోదు చేసిన వెంటనే ప్రయాణ ఏర్పాట్లు, టికెట్లు తదితర అంశాలను ప్రభుత్వం స్వయంగా చూసుకుంటుందని DHS స్పష్టం చేసింది. పండుగల సీజన్‌లో అక్రమ వలసదారులు తమ కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అయితే, ఈ ఆఫర్‌ను పట్టించుకోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ, “ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేస్తాం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తాం. అలా బహిష్కరించబడిన వారు భవిష్యత్తులో ఎప్పటికీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదు” అని తేల్చి చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి దేశంలో కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
ఇప్పటికే ఈ పథకం ద్వారా భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాను విడిచి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లారని క్రిస్టీ నోయెమ్ తెలిపారు. వేలాది మంది ‘CBP Home’ యాప్‌ను ఉపయోగించి రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో మే నెలలో ఈ ప్రోత్సాహకాన్ని 1,000 డాలర్లుగా నిర్ణయించగా, ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా దానిని మూడు రెట్లు పెంచి 3,000 డాలర్లకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అక్రమ వలసను నియంత్రించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.