ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అంతర్జాతీయ సైబర్ నేర ముఠాకు భారీ షాక్ ఇచ్చారు. కంబోడియా కేంద్రంగా పనిచేస్తూ భారత్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను సీఐడీ ఛేదించింది. విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాకు కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సహకారంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుడి వద్ద నుంచి ఏకంగా 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డులను అక్రమంగా వినియోగిస్తూ ‘సిమ్ బాక్స్’ టెక్నాలజీ ద్వారా విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధానం వల్ల బాధితులు మోసాన్ని గుర్తించలేకపోతున్నారని సీఐడీ తెలిపింది.
విశాఖపట్నం, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, కంబోడియా నుంచి ఆదేశాలు తీసుకుంటూ ఈ ముఠా కార్యకలాపాలు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం, ఓటీపీ మోసాలు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు వంటి అనేక రకాల సైబర్ నేరాలకు ఈ గ్యాంగ్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని సీఐడీ స్పష్టం చేసింది. సిమ్ కార్డుల సరఫరా, సిమ్ బాక్స్ ఏర్పాటు, విదేశీ లింకులపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ సైబర్ నేరాలపై ఏపీ సీఐడీ దూకుడు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.