భారతీయ రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ ధరలను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త టికెట్ ధరలు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే స్టేషన్లలో ప్రదర్శించే చార్జ్ లిస్ట్‌లను కూడా కొత్త ధరలకు అనుగుణంగా మార్చనున్నారు.
కొత్త నిర్ణయం ప్రకారం, సాధారణ రెండో తరగతి (ఆర్డినరీ) ప్రయాణాల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెరుగుదల ఉండదు. 216 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు కిలోమీటర్‌కు 1 పైసా చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. దీని వల్ల చిన్న దూరం ప్రయాణించే ప్రయాణికులకు భారంగా మారదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇక మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. ఇది నాన్-ఏసీతో పాటు అన్ని ఏసీ కోచ్‌లకూ వర్తిస్తుంది. ఉదాహరణకు, 500 కిలోమీటర్ల ప్రయాణానికి నాన్-ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే సుమారు రూ.10 మాత్రమే అదనంగా చెల్లించాల్సి వస్తుంది అని అధికారులు తెలిపారు.
సబర్బన్ రైళ్లు, సీజన్ టికెట్లకు మాత్రం ఎలాంటి మార్పులు లేవు. అలాగే రోజూ రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్ల ధరలు కూడా కిలోమీటర్‌కు 1 పైసా చొప్పున స్వల్పంగా మాత్రమే పెంచారు.
డిసెంబర్ 26 తర్వాత బుక్ చేసే టికెట్లకే ఈ కొత్త ధరలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతకుముందు బుక్ చేసిన టికెట్లకు, ప్రయాణం తర్వాత జరిగినా అదనపు ఛార్జీలు ఉండవని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, రైల్వే ఆర్థిక స్థిరత్వం రెండింటినీ సమతుల్యం చేయడమే ఈ నిర్ణయ లక్ష్యమని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.