నిరుద్యోగ యువతకు శుభవార్త. శ్రీకాకుళం జిల్లా కోర్టు పరిధిలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు ఇది మంచి అవకాశంగా అధికారులు పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలు పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో చేపట్టనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు. రికార్డు అసిస్టెంట్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. అందులో ఒకటి ఓపెన్ క్యాటగిరీ (OC), మరొకటి ఎస్సీ (SC) వర్గానికి కేటాయించారు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఒకటి (OC), ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టు ఒకటి (OC)గా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుంచి గరిష్టంగా రూ.89,720 వరకు వేతనం అందిస్తారని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు మంచి వేతనం ఉండటంతో ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
విద్యార్హతల విషయానికి వస్తే, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్, లిబ్రో ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్ వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన ఉండటం తప్పనిసరి. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా SSC ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 42 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. అయితే SC, ST, BC, EWS, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి. దరఖాస్తులను కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ‘చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ అనే చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు, పూర్తి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు srikakulam.dcourts.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.