దక్షిణాఫ్రికా, (South Africa) మొజాంబిక్, జింబాబ్వే దేశాలను వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉద్ధృతమైన వరదలు తీవ్ర విపత్తులోకి నెట్టేశాయి. గత కొన్ని వారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన నదులు పొంగిపొర్లి పట్టణాలు, గ్రామాలను నీటముంచేశాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగి ధ్వంసమయ్యాయి.
లక్షలాది మంది తమ నివాసాలను కోల్పోయి రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా జింబాబ్వేలో పరిస్థితి మరింత విషమంగా మారింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అక్కడ ఒక్క దేశంలోనే 70 మందికి పైగా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరదల ఉద్ధృతికి వంతెనలు తెగిపడిపోగా, ప్రధాన రహదారులు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని పట్టణాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయి సహాయక బృందాలు చేరుకోవడమే కష్టంగా మారింది.
బాధితులను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించి పై నుంచి ఆహారం, తాగునీరు, వైద్య సరఫరాలను పంపిణీ చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అయితే నిరంతర వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పంట భూములు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వ్యవసాయ నష్టం కూడా భారీగా చోటుచేసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వరదల కారణంగా తాగునీటి వనరులు కలుషితమవడంతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే అనేక శిబిరాల్లో తాత్కాలిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా కొన్ని రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విపత్తు దక్షిణాఫ్రికా ఖండంలోని దేశాలకు భారీ మానవీయ సంక్షోభాన్ని తీసుకొచ్చింది. అంతర్జాతీయ సంస్థలు సహాయక చర్యలకు ముందుకొస్తుండగా, ప్రపంచ దేశాలు ఆహార, వైద్య, పునరావాస సహాయం అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రకృతి ఉగ్రరూపం దాల్చిన ఈ వరదలు వేలాది కుటుంబాలను కన్నీటి లోయలోకి నెట్టగా, సాధారణ జీవనం తిరిగి గాడిలో పడేందుకు ఇంకా చాలా సమయం పట్టే పరిస్థితి నెలకొంది.