ఆస్ట్రేలియా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ ఇన్నోవేషన్ వీసా భారతీయుల కోసం పెద్ద అవకాశంగా మారింది. ఈ వీసా పథకంతో, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఉద్యోగ ఆఫర్ లేకుండా, నేరుగా శాశ్వత నివాస హక్కు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఇతర దేశాల శాశ్వత నివాస పథకాల్లో డబ్బు పెట్టుబడి పొదుపు ఖాతా చూపించడం, ఉద్యోగం, పాయింట్ పరీక్ష వంటి షరతులు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త విధానం పూర్తిగా భిన్నంగా ఉండటం విశేషం.
ఈ వీసా 2024 చివర్లో అధికారికంగా ప్రవేశపెట్టబడింది. ముందుగా అమలులో ఉన్న గ్లోబల్ టాలెంట్ వీసాను రద్దు చేసి, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి ఈ కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచంలో ఆర్థిక ప్రభావం చూపగల వ్యక్తులను ఆస్ట్రేలియాలో స్థిరపడేలా చేయడం. అందులో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఎంపికైన వ్యక్తికి మొదటి రోజునుండే శాశ్వత నివాస హక్కు ఇవ్వబడుతుంది. ఆరోగ్య సేవలు, పిల్లల విద్య, భవిష్యత్తులో పౌరసత్వం వంటి అన్ని హక్కులు కూడా అందుబాటులో ఉంటాయి.
అలాగే కుటుంబ సభ్యులను కూడా కలుపుకునే అవకాశం ఉంటుంది. సాధారణ వీసాల మాదిరిగా ఉద్యోగదారు స్పాన్సర్ అవసరం ఉండదు. ఈ వీసాకు ఎంపిక కావడానికి ముఖ్యమైన అర్హత ప్రతిభ మరియు అంతర్జాతీయ గుర్తింపు. వ్యక్తి తన రంగంలో సాధించిన ప్రతిభను రుజువు చేసే పత్రాలు ఉండాలి. పేటెంట్లు, అంతర్జాతీయ పురస్కారాలు, పరిశోధనలు, ప్రముఖ సంస్థల్లో నాయకత్వ పాత్రలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పనులు వంటి ఆధారాలు అర్హతను నిరూపిస్తాయి. ఈ వీసా కోసం పాయింట్ పరీక్ష అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రతిభ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
అయితే ఒక ముఖ్యమైన నిబంధన కూడా ఉంది అభ్యర్థి ఆస్ట్రేలియాలో జాతీయ స్థాయి ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి లేదా సంస్థ ద్వారా నామినేషన్ పొందాలి. అంటే ఆ వ్యక్తి చేసిన పనికి విలువ ఉందని, అతను లేదా ఆమె ఆస్ట్రేలియాకు ఉపయోగపడుతారని నిర్ధారించాలి. ఆ తర్వాత అభ్యర్థి తన ప్రతిభకు సంబంధించిన పత్రాలను సమర్పించి, ఒక ప్రత్యేక పరిశీలన ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు. ఎంపికైన వెంటనే వారికి శాశ్వత నివాస హక్కు ఇస్తారు.
ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో లేదు. ఇది పూర్తిగా ఆహ్వాన పద్ధతిలో ఉంటుంది. ముందుగా షార్ట్‌లిస్ట్ అవ్వాలి, తర్వాత మాత్రమే వీసా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, వారు ఆస్ట్రేలియాకు ప్రత్యేక మేలు చేసే సామర్థ్యం ఉందని నిరూపించాలి.
సాంకేతిక రంగం, ఆరోగ్య సేవలు, వ్యవసాయ సాంకేతికత, పరిశోధన, విద్య, సృజనాత్మక కళల రంగాల్లో ఉన్న భారతీయులకు ఇది అరుదైన అవకాశం. సాధారణంగా వీసా లేదా పీఆర్ పొందడానికి ఎదురయ్యే అడ్డంకులు, డబ్బు, ఉద్యోగ ఆఫర్, పాయింట్ పరీక్ష, స్పాన్సర్ అవసరం లాంటివి ఇక లేవు. ప్రతిభ ఉన్నవారికి కొత్త జీవితం ప్రారంభించే బంగారు అవకాశం గా చెప్పుకోవచ్చు.