ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానం చేసే విశాఖపట్నం–రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే (NH-130CD) నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఆరు వరుసలతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.16,482 కోట్ల వ్యయంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మౌలిక వసతుల ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ హైవే 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయ్యాక మూడు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది.
ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా నిలిచింది విజయనగరం జిల్లాలోని ఎల్.కోట సమీపంలో నిర్మిస్తున్న వృత్తాకార రహదారి. చెరువు చుట్టూ వృత్తంలో నిర్మిస్తున్న ఈ రహదారి ఇంజినీరింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఒడిశాలోని ఉమ్మరికోట వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్ అనేక రహదారులను కలిపే కీలక కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో సూచిక బోర్డులు, మార్గదర్శకాలు ఏర్పాటు పూర్తయ్యాయి.
ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఎక్కువ శాతం కొండలు, అడవుల మధ్యగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించిన వెంటనే సుంకి ఘాట్ సమీపంలో 3.4 కిలోమీటర్ల పొడవున్న రెండు పెద్ద సొరంగాలు నిర్మిస్తున్నారు. ఈ సొరంగాలు పూర్తైన తర్వాత కొండప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ టన్నెల్స్ ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్య ఇంజినీరింగ్ అద్భుతాలుగా గుర్తించబడుతున్నాయి.
ప్రస్తుతం రాయపూర్–విశాఖపట్నం ప్రయాణం కోసం NH-26 మార్గంలో 597 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అయితే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయ్యాక అదే ప్రయాణం 464 కిలోమీటర్లకే తగ్గుతుంది, అంటే మొత్తం 133 కిలోమీటర్ల దూరం తగ్గింపు. దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గంలో విశాఖ చేరుకోవడానికి 12 గంటలు పడుతుంటే, కొత్త హైవే వల్ల ఈ సమయం కేవలం 6 గంటలకు తగ్గిపోతుంది.
వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఈ హైవే భారీ లాభాలు అందిస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పారిశ్రామిక మండలాలు నేరుగా విశాఖపట్నం పోర్ట్‌తో అనుసంధానం అవుతాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి కూడా సులభంగా కనెక్ట్ అవడంతో సరకు రవాణా వేగం పెరుగుతుంది. మొత్తంగా, ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తవ్వడంతో విశాఖ–రాయపూర్ ప్రయాణం వేగవంతం కావడంతో పాటు, వ్యాపారాలు, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలు భారీగా లాభపడనున్నాయి.