సౌదీ అరేబియా మళ్లీ మద్యం విక్రయాలపై నిబంధనలను సడలించింది. దేశంలో నివసించే నాన్-ముస్లిం విదేశీయులు ఇప్పుడు మద్యం కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అందుబాటులో లేదు. నెలకు 50,000 రియాల్స్ (సుమారు ₹11 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక అనుమతి ఇస్తున్నారు. రియాద్‌లోని ఏకైక అధికారిక మద్యం స్టోర్‌లో ప్రవేశించేందుకు సాలరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాలి.
గతంలో ఈ స్టోర్‌కు కేవలం విదేశీ రాయబారులకు మాత్రమే ప్రవేశం ఉండేది. తరువాత ‘ప్రీమియం రెసిడెన్సీ’ ఉన్నవారికి కూడా అనుమతించారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కొందరు అధిక ఆదాయం కలిగిన విదేశీయులకు కూడా విస్తరించారు. అయితే ఈ మార్పులపై సౌదీ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. బ్లూమ్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం, మద్యం కొనుగోలు చేసేందుకు పాయింట్ ఆధారిత నెలసరి పరిమితి అమలులో ఉంది. అంటే కస్టమర్లు ఎన్ని బాటిళ్లు కొనగలరు అనేది ముందే నిర్ణయించిన పాయింట్‌ల ఆధారంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే రియాద్‌తో పాటు దేశంలోని మరో రెండు నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలను నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కఠినమైన మద్యం నిషేధ విధానంతో ప్రపంచానికి గుర్తింపు పొందిన సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయాలతో మరో కీలకమైన సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు. విజన్ 2030 ప్రణాళికలో భాగంగా, సౌదీ అరేబియా ప్రపంచ పెట్టుబడులు, నైపుణ్యాలు, టాలెంట్‌ను ఆకర్షించే దిశగా సంస్కరణలు చేపడుతోంది. విదేశీయులు సౌకర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ద్వారా రాజధాని రియాద్‌ను అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ లక్ష్యం.
గత కొన్ని సంవత్సరాలుగా మహిళలకు డ్రైవింగ్ అనుమతి, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, సంగీత కార్యక్రమాలు, పర్యాటకులకు సడలింపులు వంటి అనేక సామాజిక సంస్కరణలు తీసుకొచ్చిన సౌదీ, ఇప్పుడు మద్యం నిబంధనలను కూడా కొంత మేర సడలిస్తోంది. ఈ చర్యలు సంప్రదాయ విధానంలో ఉన్న రాజ్యానికి పెద్ద మార్పులుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ సంస్కరణలు తీసుకువస్తున్న వేగం అక్కడి పాలక వర్గం ముందు ఉన్న సవాళ్లను కూడా సూచిస్తోంది.
ఇస్లాం పుట్టినిల్లు అయిన ఈ రాజ్యంలో మార్పులను అమలు చేయడం అత్యంత సున్నితమైన పని. సామాజిక, మతపరమైన భావజాలాలను కాపాడుతూ, ఒకేసారి ఆర్థిక వ్యవస్థను విస్తరించాలి. విదేశీ ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంగా మార్పులను జాగ్రత్తగా అమలు చేస్తున్న ప్రభుత్వం, మద్యం విక్రయాల సడలింపును కూడా అదే వ్యూహంలో భాగంగా చూస్తోంది.ఈ సంస్కరణలు భవిష్యత్తులో సౌదీ అరేబియాను ఒక గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మార్చగలవా లేదా అన్నది మరికొన్ని సంవత్సరాల్లో స్పష్టమవుతుంది.