గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేశాయి..
ప్రజల్లో అవగాహన కోసం హీరో నాని తన వంతు సాయం చేశారు..
ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పారిశుధ్య రంగంలో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “చెత్త నుంచి సంపద” అనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందన్నారు.
గ్రామాల్లో చెత్త సేకరణ, నిర్వహణను సులభతరం చేయడంలో స్వచ్ఛరథాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలను ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పారిశుధ్యంపై అవగాహన పెంచగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ప్రముఖ నటుడు నాని చేసిన సహకారం విశేషమని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏప్రిల్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల కిలోల పొడి చెత్తను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సేకరించిన చెత్తకు బదులుగా ప్రజలకు రూ.3.32 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు. ఈ విధానం గ్రామీణ ప్రజలను మరింతగా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచేందుకు స్వచ్ఛరథాలు ఒక ముఖ్య సాధనంగా మారాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రజలు చూపుతున్న చైతన్యం, భాగస్వామ్యం ఈ కార్యక్రమం విజయానికి బలమని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.