దేశవ్యాప్తంగా నిర్వహించిన అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో మొత్తం 5,100 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. వీరిలో 5,000 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా, 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. ఈ ఎంపికలో తెలుగు రాష్ట్రాలు మరోసారి తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345 మంది, తెలంగాణ నుంచి 538 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తెలుగు విద్యార్థులు సాధించిన ఈ విజయం, వారి అకడమిక్ సామర్థ్యానికి, కష్టపడి చదివే తత్వానికి స్పష్టమైన నిదర్శనంగా మారింది.
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ఉన్నత విద్యను అందించడమే ఈ స్కాలర్‌షిప్ (Scholarship) ప్రధాన లక్ష్యం. ప్రతిభ–ఆర్థిక స్థితి ఆధారంగా (Merit-cum-Means) విధానంలో జరిగిన ఈ ఎంపికలో 83 శాతం మంది విద్యార్థులు వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచి రావడం గమనార్హం. ముఖ్యంగా బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు తగిన ప్రాధాన్యం కల్పించారు. ఎంపికైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇది పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య కలగా కాకుండా వాస్తవంగా మారేందుకు తోడ్పడనుంది.
ఈ స్కాలర్‌షిప్ ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. మెంటరింగ్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణ, గ్లోబల్ అల్యూమిని నెట్‌వర్క్‌తో అనుసంధానం వంటి అవకాశాలు కూడా అందించనున్నారు. ఈ సమగ్ర సహకారం ద్వారా విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలోనూ ముందంజ వేయగలుగుతారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నూతన తరం నాయకులను తయారు చేయడమే ఈ కార్యక్రమం దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలంగాణ నుంచి ఎంపికైన విద్యార్థుల్లో భద్రాచలానికి చెందిన రైతు బిడ్డ యర్ర షాలిని ఒకరు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఐఐటీ రోపర్‌లో BSc, BEd చదువుతున్న ఆమె తన అనుభవాన్ని పంచుకుంటూ, “మాలాంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఆర్థిక సమస్యలే ఉన్నత విద్యకు పెద్ద అడ్డంకి. ఈ స్కాలర్‌షిప్ వల్ల నా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతున్నాను. నా లక్ష్యాలను సాధించడానికి ఇది గొప్ప ప్రోత్సాహం” అని అన్నారు. ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ ( Reliance Foundation) వివిధ సామాజిక వర్గాలకు చెందిన 33,471 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. ధీరుభాయ్ అంబానీ దార్శనికతతో నీతా అంబానీ 2022లో ప్రకటించిన ఈ కార్యక్రమం, వచ్చే 10 ఏళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.