భారతీయ యానిమేషన్ రంగం మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల బరిలో అధికారికంగా నిలిచింది. విడుదల సమయంలో ఎలాంటి అంచనాలు ప్రమోషన్స్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ యానిమేటెడ్ చిత్రం తన కంటెంట్, విజువల్స్, భావోద్వేగాలతో దేశీయంగా మాత్రమే కాక అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ విజయయాత్ర ఆస్కార్ వరకు చేరుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది.
కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఆశ్చర్యకరంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన ఈ కథను అద్భుతమైన గ్రాఫిక్స్, శక్తివంతమైన నేపథ్య సంగీతం, అధ్భుతమైన సన్నివేశం ఈ సినిమాను ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. చాలా మంది ప్రేక్షకులు స్వామి వారు నిజంగానే ప్రత్యక్షమయ్యాడా అనే భావన అనిపించేలా విజువల్స్ ఉండటమే ఈ చిత్రానికి ప్రధాన బలం.
సాధారణంగా యానిమేషన్ చిత్రాల్లో కనిపించే సాదాసీదా రీతిని విడిచిపెట్టి భావోద్వేగాలను అంతగా ప్రాధాన్యపెట్టడం ఈ సినిమాను మరింత మెరుగైన స్థాయికి తీసుకెళ్లింది.ప్రచార కార్యక్రమాలు పెద్దగా చేయకుండానే పూర్తిగా మౌత్ టాక్ పై ఆధారపడి థియేటర్లలో రికార్డు కలెక్షన్లు తెచ్చుకోవడం స్పష్టంగా చూపిస్తోంది. చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఆసక్తిగా చూడగలగడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. యానిమేషన్ సినిమాలు పిల్లలకే పరిమితం అనే అభిప్రాయాన్ని ఇది పూర్తిగా చెరిపేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ రేసులో ఉండటంతో భారత యానిమేషన్ రంగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది.
అకాడమీ ప్రకటించిన జాబితాలో మహావతార్ నరసింహతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ప్రముఖ యానిమేషన్ చిత్రాలు కూడా చోటు దక్కించుకున్నాయి. డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్, ది బ్యాడ్ గైస్ 2, డాగ్ మాన్, లైట్ ఆఫ్ ది వరల్డ్, ది లెజెండ్ ఆఫ్ హేయి 2 వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, భారతదేశం నుంచి వచ్చిన ఈ చిత్రానికి విశేష చర్చ లభిస్తోంది. అంతర్జాతీయ మాధ్యమాలు కూడా ఈ సినిమాను ‘సర్ప్రైజ్ ఎంట్రీ’గా పేర్కొంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి.
తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం ఏమిటంటే యానిమేషన్ రంగంలో ఇప్పటివరకు అరుదుగా మాత్రమే ఆస్కార్ స్థాయి గుర్తింపు దక్కింది. ఇప్పుడీ చిత్రం ఆస్కార్ నామినేషన్ సాధించడం వల్ల భవిష్యత్తులో మరిన్ని యానిమేషన్ ప్రాజెక్టులు ఉత్సాహంగా ముందుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందే యానిమేటెడ్ మూవీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
ఆస్కార్ అవార్డు గెలుస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఈ నామినేషన్ ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని ప్రపంచ సినిమాలో నిలబెట్టింది. నిర్మాతలు, దర్శకుడు అశ్విన్ కుమార్, మొత్తం యానిమేషన్ టీమ్ కోసం ఇది ఒక గొప్ప గుర్తింపు. భారతీయ కంటెంట్ ప్రపంచానికి చేరగల సామర్థ్యం ఎంత ఉందో దీనితో మరోసారి నిరూపితమైంది.