అమెరికాలో స్థిరపడి జీవించాలనుకునే ధనిక విదేశీయులకు శుభవార్త. ట్రంప్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సహకారం అందించే వారికి గ్రీన్ కార్డ్ దారిని సులభతరం చేసే కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ముందడుగు వేసింది. 'గోల్డ్ కార్డ్' పేరుతో తీసుకొస్తున్న ఈ ప్రత్యేక పథకం కింద, అమెరికాకు ప్రాధాన్యమైన ప్రయోజనం చేకూర్చగలరని భావించే విదేశీయులకు శాశ్వత నివాస హోదా ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఐ-140G అనే దరఖాస్తు ఫారాన్ని యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు పంపింది. సంబంధిత అధికారుల అనుమతి పెండింగ్‌లో ఉండగా, అన్ని ప్రక్రియలు పూర్తి అయితే డిసెంబర్ 18 నాటికి ఈ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
'గోల్డ్ కార్డ్' వీసా అంటే ఏమిటి? ఈ కొత్త పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తులు భారీ మొత్తంలో ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది. వీసా ఆమోదం పొందిన వెంటనే, తిరిగి ఇవ్వని కానుక రూపంలో ఒక మిలియన్ డాలర్లు (సుమారు ₹8.3 కోట్లు) ప్రభుత్వానికి చెల్లించాలి. కార్పొరేట్ సంస్థల పేరుతో దరఖాస్తు చేసుకునే వారికి ఈ మొత్తం రెండుమిలియన్ డాలర్లుగా ఉంటుంది. అదనంగా, ప్రతి దరఖాస్తుపై 15,000 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు. ఇంకా, అత్యంత ప్రీమియమ్ లెవల్ కోసం ‘ప్లాటినం కార్డ్’ ఆప్షన్‌ను కూడా తీసుకురానున్నారు. దీని కింద ఐదు మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లకుపైగా) సహకారం అందించేవారికి విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు లాంటి అదనపు ప్రయోజనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా విధానం స్థానంలో ‘గోల్డ్ కార్డ్’ పథకం రానుంది. EB-5 వీసాల ఆమోద ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండటం, పెద్దఎత్తున మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉండటం వంటి కారణాల వల్లనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. "EB-5 విధానం ఈ రోజుల్లో ఉపయోగకరంగా లేదు. మోసాలకు పెద్దఎత్తున అవకాశం ఇస్తోంది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ 'గోల్డ్ కార్డ్' ప్రోగ్రామ్‌ను ప్రోత్సహిస్తున్నారు," అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ పేర్కొన్నట్లు రాయిటర్స్ సమాచారం తెలిపింది. కొత్త పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, అమెరికాకు భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు.
ఈ వీసా పొందేందుకు ఆర్థిక సామర్థ్యం మాత్రమే కాకుండా దరఖాస్తుదారుల గత చరిత్రపై కూడా కఠినమైన పరిశీలన ఉంటుంది. నేర చరిత్ర, పన్ను రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీ హోల్డింగ్‌లు వంటి వివరాలను విశ్లేషించిన తర్వాతే గ్రీన్ కార్డ్‌ను మంజూరు చేస్తారు. కొత్త పథకం ఇంకా అధికారికంగా ప్రారంభం కాకపోయినా, త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని USCIS అధికారులు వెల్లడించారు. మొత్తంగా, గోల్డ్ కార్డ్ పథకం అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని ఆశించే సంపన్నులకు కొత్త మార్గాన్ని తెరవనుంది.