తిరుమల రూ.300 టికెట్లకు భారీ డిమాండ్.. స్పష్టత ఇచ్చిన టీటీడీ!
Tirumala Rs 300 Darshan Tickets: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. టికెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి ప్రయత్నించడంతోనే పోటీ తీవ్రంగా ఉంటోందని తెలిపింది. అందుబాటులో ఉన్న టికెట్ల కంటే డిమాండ్ అనేక రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిసేపులోనే కోటా పూర్తవుతోందని వివరించింది.
తిరుమల టికెట్ల బుకింగ్‌పై టీటీడీ స్పష్టత.. ‘Slot Unavailable’ ఎందుకు వస్తుందంటే?..
అందుబాటులో ఉన్న కోటా కంటే దాదాపు 9 రెట్లు అధికంగా డిమాండ్.. వర్చువల్ క్యూ సాంకేతిక విధానమేనని వివరణ..
తిరుమల: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. టికెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి ప్రయత్నించడంతోనే పోటీ తీవ్రంగా ఉంటోందని తెలిపింది. అందుబాటులో ఉన్న టికెట్ల కంటే డిమాండ్ అనేక రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిసేపులోనే కోటా పూర్తవుతోందని వివరించింది.
ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న సందేహాల నేపథ్యంలో టీటీడీ ఈ వివరణ ఇచ్చింది. భారీ ట్రాఫిక్‌ను నిర్వహించేందుకు తన ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అధునాతన సాంకేతికతతో రూపొందించినట్లు తెలిపింది.
భారీ ట్రాఫిక్‌ను ఎదుర్కొనేలా సాంకేతిక వ్యవస్థ
టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ (GCP), లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజాంటల్ స్కేలింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తున్నట్లు తెలిపింది.
టికెట్ల విడుదల సమయంలో ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగినప్పుడు అప్లికేషన్, API, గేట్‌వే సేవలకు సంబంధించిన అనేక రెప్లికాలను ఉపయోగిస్తున్నామని పేర్కొంది. సాంకేతిక బృందాలు నిరంతరం సిస్టమ్ పనితీరును పర్యవేక్షిస్తుంటాయని తెలిపింది.
అంతేకాకుండా టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేకంగా ‘టెక్నికల్ వార్ రూమ్’ ఏర్పాటు చేసి అప్లికేషన్ పనితీరు, మౌలిక సదుపాయాల పరిస్థితి, లావాదేవీలు, భద్రత తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
2.69 లక్షల టికెట్లకు.. 24 లక్షల వరకు డిమాండ్
అధిక డిమాండ్ ఉన్న సమయంలో సుమారు 6 లక్షల మంది వినియోగదారులు ఒకేసారి టికెట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఒక్కో వినియోగదారు సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం టికెట్లు బుక్ చేయాలని ప్రయత్నిస్తే, మొత్తం డిమాండ్ సుమారు 24 లక్షల టికెట్ల వరకు చేరవచ్చని వివరించింది.
అయితే అందుబాటులో ఉండే కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటా కంటే డిమాండ్ దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా ఉంటోంది. దీంతో ఒకే సమయంలో వేలాది మంది ఒకే స్లాట్ కోసం ప్రయత్నించినప్పుడు టికెట్లు చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతున్నాయని టీటీడీ పేర్కొంది.
వర్చువల్ క్యూ ఎందుకు?
భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల బ్యాక్‌ఎండ్ వ్యవస్థలపై అధిక భారం పడకుండా ఉండేందుకు వర్చువల్ క్యూ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
వర్చువల్ క్యూ భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదని స్పష్టం చేసింది. ఒకేసారి వచ్చే భారీ సంఖ్యలో అభ్యర్థనలను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే సాంకేతిక విధానమని వివరించింది.
అదే విధంగా ‘Slot Unavailable’ వంటి సందేశాలు కనిపించడం కూడా టికెట్లు అధిక డిమాండ్ కారణంగా వేగంగా పూర్తయినప్పుడు రావచ్చని తెలిపింది. అలాంటి సందేశాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందని నిర్ధారించకూడదని టీటీడీ సూచించింది.
చెల్లింపు విఫలమైతే కారణం పరిశీలించాలి
ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో కూడా టీటీడీ వివరణ ఇచ్చింది. చెల్లింపు ప్రక్రియ కేవలం టీటీడీ అప్లికేషన్‌పైనే ఆధారపడి ఉండదని పేర్కొంది. పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, యూపీఐ వ్యవస్థలు కూడా ఇందులో భాగస్వాములవుతాయని తెలిపింది.
అందువల్ల ఏదైనా లావాదేవీ విఫలమైనప్పుడు అది ఏ దశలో ఆగిపోయిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది. టికెట్ పొందలేకపోవడాన్ని ప్రతిసారీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ వైఫల్యంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.
భక్తుల సూచనల మేరకు నిరంతర మార్పులు
భక్తుల నుంచి వచ్చే సూచనలు, గతంలో నమోదైన ట్రాఫిక్ నమూనాల ఆధారంగా ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను టీటీడీ నిరంతరం మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. అప్లికేషన్, డేటాబేస్ పనితీరు, భారీ ట్రాఫిక్‌ను నిర్వహించే సామర్థ్యం, సైబర్ భద్రత, యాంటీ-బాట్ వ్యవస్థలు, చెల్లింపు ప్రక్రియల్లో మెరుగుదలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది.
భవిష్యత్ టికెట్ విడుదలల సమయంలో వచ్చే డిమాండ్‌ను అంచనా వేసి, సామర్థ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా సమీక్ష చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇతర ఆలయాల సేవలకు కూడా ఇదే ఆన్‌లైన్ వ్యవస్థ
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వంటి ఆలయాలకు సంబంధించిన దర్శనం, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ ఆలయాల సేవలకు సంబంధించి డిమాండ్ తక్కువగా ఉండటంతో సాధారణంగా బుకింగ్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని వివరించింది.
సోషల్ మీడియాలోని నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మొద్దు
అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని టీటీడీ పేర్కొంది. ఒక ప్రయత్నంలో టికెట్ లభించకపోయినంత మాత్రాన ఆన్‌లైన్ వ్యవస్థ విఫలమైందని భావించవద్దని భక్తులకు సూచించింది.
సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులకు సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన ఆన్‌లైన్ బుకింగ్ సేవలు అందించేందుకు సాంకేతిక వ్యవస్థను నిరంతరం మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేసింది.
Be the first to react