కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే సాధారణ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. జనవరి 1 నుంచి జీతాలు, రుణాలు, పన్నులు, బ్యాంకింగ్ సేవలు, గ్యాస్ ధరలు వంటి అనేక అంశాల్లో కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఉద్యోగులు, రైతులు, రుణగ్రహీతలు, పన్ను చెల్లింపుదారులు అందరికీ ఇవి ముఖ్యమైనవిగా మారనున్నాయి.
రుణాలు, క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన మార్పులు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే అవకాశముంది. ఇకపై క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్డేట్ చేయనున్నారు. దీంతో రుణం చెల్లించిన వెంటనే స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ వంటి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడంతో లోన్ తీసుకున్న వారికి ఊరట లభించనుంది.
పాన్–ఆధార్ లింక్ తప్పనిసరి కావడం మరో కీలక మార్పు. 2026 జనవరి 1 నుంచి ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డ్ పనిచేయదు. బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ సేవలు, ఐటీఆర్ దాఖలు వంటి పనులు చేయాలంటే లింక్ తప్పనిసరి. లింక్ చేయని వారికి సేవలు నిలిచిపోవచ్చు.
ఉద్యోగులు, రైతులకు కూడా ముఖ్యమైన మార్పులు రానున్నాయి. 7వ పే కమిషన్ గడువు ముగియడంతో 8వ పే కమిషన్ అమలు అయ్యే అవకాశం ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు రావచ్చు. రైతుల విషయంలో పీఎం కిసాన్ పథకానికి ప్రత్యేక ఐడీ తప్పనిసరి కానుంది. అలాగే పంట నష్టం జరిగితే 72 గంటల్లో సమాచారం ఇస్తేనే బీమా లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఇంటి ఖర్చులపై ప్రభావం చూపే మార్పులు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ ధరలు, ఏటీఎఫ్ ధరలు మారే అవకాశం ఉంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారాలు రావడంతో పన్ను దాఖలు సులభం అవుతుంది. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డుల లౌంజ్ యాక్సెస్ నియమాలు మారి, వోచర్ విధానం అమల్లోకి రానుంది.