దేశంలో దశాబ్దాలుగా భద్రతా బలగాలకు సవాలు విసురుతున్న మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. “తిరిగి కోలుకునే అవకాశం లేని దశకు చేరుకున్నాం” అని సీపీఐ (మావోయిస్టు) పార్టీ పొలిట్‌బ్యూరో స్వయంగా అంగీకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024లో రూపొందిన ‘పోలిట్‌బ్యూరో సర్క్యులర్ 1/2024’ అనే అంతర్గత నివేదిక లీక్ కావడంతో, ఉద్యమ పతనానికి సంబంధించిన చేదు నిజాలు బయటపడ్డాయి. ఉద్యమాన్ని విస్తరించడమే కాదు, ప్రస్తుతం మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ నివేదిక ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎదురుదాడి వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ‘సూరజ్‌కుంద్ వ్యూహం’, 2024లో ప్రారంభమైన ‘ఆపరేషన్ కగార్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లు మావోయిస్టు నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొంది. దళాలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం, కార్పెట్ సెక్యూరిటీ పేరుతో భారీ బలగాల మోహరింపు, కేంద్ర కమిటీ నుంచి జోనల్ స్థాయి నాయకుల వరకు లక్ష్యంగా చేసుకోవడం వంటి వ్యూహాలు ఉద్యమాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంగీకరించింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ, ఇతర నిఘా సంస్థల దాడులతో అర్బన్ నెట్‌వర్క్ పూర్తిగా కుదేలైందని నివేదికలో పేర్కొన్నారు.
మావోయిస్టుల పతనానికి కేవలం భద్రతా బలగాల ఒత్తిడే కారణం కాదని, తమ అంతర్గత వైఫల్యాలే ప్రధాన కారణమని ఈ నివేదికలో స్వీయ విమర్శ చేసుకున్నారు. అజ్ఞాతవాస వ్యూహమే ఇప్పుడు ఉద్యమానికి ఉరితాడిగా మారిందని స్పష్టం చేశారు. పూర్తిగా రహస్యంగా పనిచేయడం వల్ల ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యామని అంగీకరించారు. గత మూడేళ్లలో ఎన్‌కౌంటర్లలో 683 మంది మావోయిస్టులు మరణించగా, అనారోగ్యంతో నలుగురు కీలక కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందడం నాయకత్వ శూన్యతను మరింత పెంచిందని నివేదిక పేర్కొంది.
అత్యంత కీలకంగా, తమ పార్టీలోకి బూర్జువా, భూస్వామ్య భావజాలం చొరబడిందని పొలిట్‌బ్యూరో స్వయంగా ఒప్పుకోవడం సైద్ధాంతిక పతనానికి నిదర్శనంగా మారింది. మారుతున్న సామాజిక-ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల విప్లవ అవసరం అనే భావన తగ్గుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలోని క్యాడర్ అజ్ఞాతంలో ఉండటానికే లక్ష్యంగా భావిస్తూ, ప్రజా ఉద్యమాల నిర్మాణాన్ని విస్మరిస్తోందని తీవ్ర విమర్శ చేసింది. ఇవన్నీ కలిపి చూస్తే, మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తిరిగి లేచే దశను దాటిపోయిందన్న సంకేతాలు ఈ లీకైన నివేదిక స్పష్టంగా ఇస్తున్నాయి.