ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ ఇటీవలే రక్తంతో సెలయేర్లుగా పారింది. హనుక్కా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్న సమయంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిలో మొత్తం 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోండి బీచ్‌లో జరిగిన ఈ కాల్పులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలమే ప్రేరణగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆమె స్పష్టం చేశారు. దాడికి పాల్పడినవారు తండ్రి, కుమారుడని వారి వయసులు వరుసగా 50 మరియు 24 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. కాల్పుల సమయంలో తండ్రిని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపగా కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ దాడికి సంబంధించి అనుమానితుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించిన జెండాలు లభించినట్లు తెలిపారు. ఈ ఆధారాల నేపథ్యంలోనే దాడి వెనుక ఉగ్రవాద ఆలోచనలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీజ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఇలాంటి అంశాలపై ప్రభుత్వం జాగ్రత్తగా స్పందించిందని, కానీ దృఢమైన ఆధారాలు లభించిన తర్వాతే ప్రజలతో వివరాలు పంచుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
బోండి బీచ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా ఆషెస్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియాలు, బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల సంఖ్యను భారీగా పెంచారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు, ఈ దాడిని అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ నాయకులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చింది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోండి బీచ్‌లో జరిగిన ఈ దారుణం ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.