సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, పేకాట వంటి జూద కార్యకలాపాలపై హైకోర్టు కఠినంగా స్పందించింది. ఏటా సంక్రాంతి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు, పేకాట వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతుండగా, వీటిని వీక్షించేందుకు రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. అయితే ఈ పందేల వల్ల జంతు హింస పెరుగుతోందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని భావించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోడిపందేలను పూర్తిగా అడ్డుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. జంతు హింస నిరోధక చట్టం, ఆంధ్రప్రదేశ్ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎలాంటి సడలింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో ప్రజాసభలు నిర్వహించి, చట్ట నిబంధనలు, శిక్షలపై అవగాహన కల్పించాలని కూడా సూచించింది. పరిస్థితి అవసరమైతే పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించేందుకు కూడా వెనుకాడవద్దని హైకోర్టు పేర్కొంది.
చట్టాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హైకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం ద్వారా తీవ్ర జీవహింసకు పాల్పడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. అలాగే అక్రమ మద్యం విక్రయం, జూదం, పందేలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిలువరించాలని స్పష్టం చేసింది.
మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాటలు, అక్రమ మద్యం అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో ఇచ్చిన ధర్మాసన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఈసారి సంక్రాంతికి గతంతో పోలిస్తే కోడి పందేల బరులు భారీగా పెరిగాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు సిద్ధమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా పందెం రాయుళ్లకు పెద్ద షాక్‌గా మారాయి.