ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం 2026లో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగాన్ని మార్చేస్తున్న ఏఐ, రాబోయే రోజుల్లో వ్యాపారం, ఉద్యోగాలు, పరిశ్రమల పనితీరును పూర్తిగా కొత్త దిశలో నడిపించబోతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో సంచలనం సృష్టించబోయే టాప్ ఏఐ స్టార్టప్‌ల జాబితాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలు విడుదల చేశాయి. ఈ జాబితాలో ఉన్న స్టార్టప్‌లకు ఇప్పటికే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం గమనార్హం.
ఐటీ పరిశోధనా సంస్థ గార్టనర్ ( Gartner) అంచనాల ప్రకారం, డేటా సెంటర్ల విస్తరణ, వ్యాపార రంగంలో ఏఐ వినియోగం పెరగడం వల్ల 2025 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ దాదాపు 50 శాతం వృద్ధి చెందింది. ఈ వృద్ధి కొనసాగుతూ 2026లో మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, స్వయంచాలక వ్యవస్థలు, ఓపెన్ ఫౌండేషన్ మోడల్స్ వంటి కొత్త ధోరణులు టెక్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.
ఈ జాబితాలో ముందంజలో ఉన్న స్టార్టప్‌లలో ఆంత్రోపిక్ (Anthropic) ఒకటి. క్లాడ్ అనే ఏఐ మోడల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తక్కువ కాలంలోనే భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. వ్యాపార రంగం, పరిశోధన, అంతర్జాతీయ విస్తరణ లక్ష్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరించింది. భద్రతతో కూడిన ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ కంపెనీని ఇతర సంస్థల నుంచి భిన్నంగా నిలబెడుతోంది.
ఎంటర్‌ప్రైజ్ భద్రత, ఏఐ ఆర్కెస్ట్రేషన్ రంగంలో దూసుకెళ్తున్న మరో స్టార్టప్ ఐరియా (Airia). పెద్ద సంస్థలు తమ సిస్టమ్స్‌లో ఏఐని వేగంగా, సురక్షితంగా అమలు చేసుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతోంది. తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా వందలాది కార్పొరేట్ కస్టమర్లను సంపాదించుకోవడం దీని విజయానికి నిదర్శనం.
సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త దారులు తెరుస్తున్న స్టార్టప్‌గా ఆరాస్కేప్ (Aurascape) పేరు తెచ్చుకుంది. ఏఐ ఆధారిత బెదిరింపులను ముందుగానే గుర్తించి నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యం. డేటా భద్రత, వినియోగదారుల రక్షణపై దృష్టి పెట్టిన ఈ సంస్థపై పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కస్టమర్ సపోర్ట్ రంగాలను కలిపి చూసే వినూత్న ప్లాట్‌ఫామ్‌గా డేవ్‌రెవ్ (DevRev) నిలుస్తోంది. సంభాషణాత్మక ఏఐ అసిస్టెంట్‌తో సంస్థలలోని డేటా సైలోలను తొలగించడం, పనులను ఆటోమేట్ చేయడం దీని ప్రత్యేకత. కోడ్ అవసరం లేకుండా ఏఐ ఏజెంట్లను రూపొందించే అవకాశం ఇవ్వడం వల్ల ఈ స్టార్టప్‌పై డెవలపర్ల ఆసక్తి పెరుగుతోంది.
కోడింగ్ రంగాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంస్థగా ఇంబ్యూ (Imbue) కనిపిస్తోంది. ఏఐ కోడింగ్ ఏజెంట్ల సహాయంతో పెద్ద ప్రాజెక్టులను సమన్వయం చేయడం, పనుల ఫలితాలను ధృవీకరించడం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాధ్యమవుతోంది.
యూరప్ నుంచి వచ్చిన శక్తివంతమైన ఏఐ స్టార్టప్‌గా మిస్ట్రల్ ఏఐ (Mistral AI) గుర్తింపు పొందింది. ఓపెన్ వెయిట్ పెద్ద భాషా మోడల్స్‌తో సంస్థలకు తమ అవసరాలకు అనుగుణంగా ఏఐను మలచుకునే అవకాశం కల్పించడం దీని బలం. కొత్త మోడల్స్ విడుదలతో ఈ కంపెనీ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సెర్చ్ రంగాన్ని కొత్త కోణంలో చూపిస్తున్న సంస్థగా పెర్ప్లెక్సిటీ (Perplexity) నిలుస్తోంది. నిజసమయ సమాచారంతో ఖచ్చితమైన సమాధానాలు అందించే ఈ ఏఐ ఇంజిన్ యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. సోషల్ మీడియా, ఓపెన్ వెబ్ నుంచి సమాచారాన్ని సమగ్రంగా ఉపయోగించడం దీని ప్రత్యేకత.
టెక్ ప్రపంచంలో సంచలనం రేపిన మరో పేరుప్రాజెక్ట్ ప్రొమెథియస్ (Project Prometheus). అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మద్దతుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పరిశ్రమల తయారీ, ఆటోమేషన్ కోసం శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది. భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా.
ఇక ఏఐ పాలన, భద్రతపై దృష్టి పెట్టిన స్టార్టప్‌గా విట్‌నెస్ ఏఐ (WitnessAI) కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా జనరేటివ్ ఏఐని రూపొందిస్తున్న సంస్థగా రైటర్ (Writer) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2026లో ఏఐ స్టార్టప్‌లు కేవలం టెక్నాలజీ రంగానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపనున్నాయి. కొత్త ఆవిష్కరణలు,భారీ పెట్టుబడులు, వేగంగా మారుతున్న అవసరాలు ఈ రంగాన్ని భవిష్యత్తులో మరింత కీలకంగా మారుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.