ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీలకమైన అనంతపురం–గుంటూరు జాతీయ రహదారి 544-డి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వినుకొండ నుంచి గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చర్యలు ప్రారంభించింది.
ఈ రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. గ్రీన్ఫీల్డ్ ప్రాంతంలో రహదారి హద్దులను గుర్తించే పనిని (పెగ్ మార్కింగ్) జనవరి 9లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిక బృందాలను ఏర్పాటు చేసి, నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
భూసేకరణ సర్వే పనులకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం అవసరమని NHAI అధికారులు తెలిపారు. ఈ మేరకు NH ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం జిల్లా సంయుక్త కలెక్టర్కు లేఖ రాశారు. హద్దుల గుర్తింపు పూర్తైన తర్వాత, భూముల కొలతలు, విలువ అంచనా ప్రక్రియ మొదలవుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు మొత్తం 85 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో డీపీఆర్ పూర్తయ్యాక 3ఏ నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పనులు వేర్వేరుగా జరగనున్నందున ఆయా జిల్లాలకు ప్రత్యేక షెడ్యూల్లు విడుదల చేశారు.
హైవే విస్తరణ పూర్తైతే అనంతపురం–గుంటూరు మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.