సంక్రాంతి పండుగ అంటే తెలుగు ఇళ్లలో ప్రత్యేకమైన వంటకాల సందడి కనిపిస్తుంది. కొత్త బియ్యం, నువ్వులు, చెరుకు గెడలు మాత్రమే కాదు… పండుగ భోజనంలో నాటు కోడి కూర ఉన్న స్థానం ప్రత్యేకం. రోజూ తినే బాయిలర్ చికెన్‌కు భిన్నంగా, పాత పద్ధతిలో చేసే నాటు కోడి కూర రుచి మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. పండుగ రోజున ఒకసారి ఈ కర్రీ వండితే ఇంటి అంతా ఘుమఘుమలతో నిండిపోతుంది. ఆ వాసనకే ఆకలి రెట్టింపు అవుతుంది.
నాటు కోడి కర్రీకి అసలు బలం మసాలా. బయట దొరికే రెడీమేడ్ మసాలాలకు బదులు, ఇంట్లోనే రోస్ట్ చేసి దంచిన మసాలా వాడితే రుచి మరో లెవెల్‌కి వెళ్తుంది. పల్లెటూర్లలో అమ్మమ్మలు చేసే వంటకాల్లో ఇదే రహస్యం. నాటు కోడి మాంసం కొంచెం గట్టిగా ఉన్నా, సరైన విధానంలో ఉడికిస్తే ముక్కలు మెత్తగా మారతాయి. మటన్ చాపలకి ఏమాత్రం తీసిపోని రుచితో ఈ కర్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ముందుగా నాటు కోడిని శుభ్రంగా కట్ చేసి, ముక్కలు కడిగి తీసుకోవాలి. వాటికి ఉప్పు, పసుపు వేసి చేతితో బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మాంసం వాసన తగ్గడమే కాకుండా, కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి, చికెన్ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. నీళ్లు ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. మీడియం మంటపై మెల్లగా ఉడికితే మాంసం లోపలివరకు సరిగ్గా ఉడుకుతుంది.
ఇక కర్రీకి అసలైన టేస్ట్ ఇచ్చేది ఉల్లిపాయ, టమోటా మిశ్రమం. కడాయిలో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడేలా ఉడికించాలి. టమోటా మిశ్రమం బాగా కరిగిన తర్వాత ముందుగా ఉడికించిన నాటు కోడి ముక్కలను వేసి కలపాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత కారం వేసి మళ్లీ కలిపితే మసాలా ముక్కలకు పట్టుకుంటుంది.
ఇప్పుడు స్పెషల్ మసాలా తయారీకి వస్తే, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, కొబ్బరి ముక్కలను ప్యాన్‌లో వేసి మెల్లగా రోస్ట్ చేయాలి. కాలిపోకుండా జాగ్రత్తగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో దంచాలి. చివరగా వెల్లుల్లి, అల్లం వేసి మరోసారి గ్రైండ్ చేస్తే ఘుమఘుమలాడే మసాలా సిద్ధమవుతుంది. ఈ మసాలాను కర్రీలో వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి.
కర్రీ ఉడికిన తర్వాత పైకి నూనె తేలుతూ, మసాలా ముక్కలకు బాగా పట్టుకుంటుంది. చివరగా కొత్తిమీర చల్లి కలిపితే నాటు కోడి కర్రీ రెడీ. గారెల్లోకి పలావ్ అన్నం, రాగి సంగటి, బిర్యానీ, అన్నంలో తింటే సంక్రాంతి భోజనం సంపూర్ణంగా మారుతుంది. ఒకసారి ఈ పద్ధతిలో వండితే, బాయిలర్ చికెన్ కూడా ఇదే స్టైల్ లో వండుకుంటారు. పండుగ రోజున కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి ఇదొక అద్భుతమైన వంటకం.