ఒకప్పుడు సరైన రహదారులు లేక ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. తిరుపతి, రాయచోటి, అనంతపురం వంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే గంటల తరబడి గుంతల రోడ్లపై ప్రయాణించాల్సి వచ్చేది. వాహనదారుల ఇబ్బందులతో పాటు వ్యాపారాలు, రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా జరిగి, మదనపల్లె ప్రాంతానికి కొత్త ఊపిరి పోసింది.
మదనపల్లె నుంచి పీలేరు వరకు దాదాపు 55.90 కిలోమీటర్ల మేర నిర్మించిన జాతీయ రహదారి ఈ మార్పుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ.1,577 కోట్ల వ్యయం చేశారు. వెడల్పైన రహదారి, సురక్షిత మలుపులు, ఆధునిక ప్రమాణాలతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే పీలేరు నుంచి తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె వరకు 18.10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని మరో రూ.360 కోట్లతో పూర్తి చేశారు. ఈ మార్గం ప్రారంభమైన తర్వాత తిరుపతికి వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారింది. మదనపల్లెతో పాటు పరిసర మండలాల నుంచి మాత్రమే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
ఇంతకు ముందు మదనపల్లె నుంచి తిరుపతికి చేరుకోవాలంటే సుమారు మూడున్నర గంటల సమయం పట్టేది. రోడ్ల పరిస్థితి వల్ల ప్రయాణం కష్టంగా ఉండేది. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి వల్ల అదే ప్రయాణం కేవలం రెండున్నర గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో ప్రయాణికులకు సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతున్నాయి. మరోవైపు మదనపల్లె నుంచి ములకల చెరువు మార్గం ద్వారా సత్యసాయి జిల్లా వైపు వెళ్లేందుకు కూడా రహదారి విస్తరణ చేపట్టారు. దాదాపు 40.46 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.342.91 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారు. దీని వల్ల జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులభమయ్యాయి.
రాయచోటి నుంచి చాగలమర్రి ప్రాంతం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1,250 కోట్లు కేటాయించారు. రాయచోటి నుంచి వేంపల్లె వరకు ఇప్పటికే రూ.250 కోట్లతో రోడ్లు పూర్తయ్యాయి. దీంతో వైఎస్సార్ కడప జిల్లా వైపు వెళ్లే మార్గం మరింత మెరుగైంది. అలాగే రాయచోటి నుంచి చిత్తూరు వెళ్లే జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గాలు పూర్తయితే మదనపల్లె, పీలేరు, రాయచోటి ప్రాంతాలు రవాణా పరంగా కీలక కేంద్రాలుగా మారనున్నాయి.
రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు పర్యాటక రంగానికి కూడా లాభం చేకూరుతోంది. మదనపల్లె సమీపంలోని హార్సిలీ హిల్స్‌కి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. మెరుగైన రోడ్ల వల్ల స్థానిక వ్యాపారాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతమైంది. ఈ అన్ని అభివృద్ధి పనులను సమన్వయం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పర్యవేక్షణ చేస్తోంది.