ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా రెండు ఆసియా హైవేలు కొనసాగుతున్నాయన్న విషయం బహుశా అందరికీ తెలియకపోవచ్చు. అయితే ఈ వార్తను చదివిన చాలామందికి “32 దేశాల మీదుగా రాకపోకలు” అనే వాక్యం పూర్తిగా గందరగోళంగా కలిగిస్తుంది . నిజానికి ఇది భయపడాల్సిన లేదా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. చాలా సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మన రాష్ట్రాల రోడ్లకు వచ్చిన ఒక అంతర్జాతీయ గుర్తింపు మాత్రమే.
ఆసియా హైవే అంటే ఒకే రోడ్డు కాదు. ఇది ఆసియా, యూరప్ ఖండాల్లో విస్తరించిన ఒక పెద్ద రోడ్డు వ్యవస్థ. దీనిని అధికారికంగా Asian Highway Network అని పిలుస్తారు. ఈ నెట్‌వర్క్ మొత్తం 32 దేశాల్లో విస్తరించి ఉంది. అంటే ఆ దేశాల్లో ఉన్న ప్రధాన జాతీయ రహదారులన్నింటినీ ఒకే అంతర్జాతీయ మ్యాప్‌లో కలిపి చూపిస్తున్నారు. దీనివల్ల సరుకు రవాణా, పర్యాటక ప్రయాణాలు, అంతర్జాతీయ లాజిస్టిక్స్ సులభంగా గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.
మన దేశంలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల్లో కొన్ని ఈ ఆసియా హైవే నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. కొత్తగా రోడ్లు నిర్మించలేదు. మనం రోజూ ప్రయాణించే రోడ్లకే మరో నంబర్ ఇచ్చారు. అందులో రెండు రహదారులు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
మొదటగా ఆసియా హైవే–45 గురించి మాట్లాడుకుంటే, ఇది కోల్‌కతా నుంచి ప్రారంభమై భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు సాగుతుంది. మనకు ఇది జాతీయ రహదారి–16గా తెలుసు. ఇదే మార్గం చెన్నై నుంచి కృష్ణగిరి వరకు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఈ మొత్తం రూట్‌ను ఆసియా హైవే–45గా గుర్తించారు. అంటే ఏపీలోని తీర ప్రాంత రహదారి కూడా ఆసియా ఖండాన్ని దాటే ఒక పెద్ద రోడ్డు గొలుసులో భాగంగా మారిందన్న మాట.
ఇక రెండోది ఆసియా హైవే–43. ఇది ఉత్తర భారతంలోని ఆగ్రా నుంచి మొదలై మధ్య భారతం గుండా దక్షిణ భారతానికి వస్తుంది. గ్వాలియర్, నాగ్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం మీదుగా ఈ రహదారి సాగుతుంది. మనకు ఇది జాతీయ రహదారి–44గా తెలుసు. తర్వాత మధురై, రామేశ్వరం, ధనుష్కోటి వరకు ఈ మార్గం విస్తరిస్తుంది. ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే ఈ రహదారి కూడా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఒక భాగంగా గుర్తింపు పొందింది.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి ఏపీ నుంచి నేరుగా విదేశాలకు కార్ తీసుకుని వెళ్లిపోవచ్చు అన్న అర్థం ఈ వార్తలో లేదు. దేశాలు మారితే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి. కానీ రోడ్డు నంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. బస్సు రూట్ లాగానే, ఒకే నంబర్ చాలా పట్టణాలు, చాలా దేశాలు ఉంటుందని అర్థం. 32 దేశాల మీదుగా రాకపోకలు” అనే మాట అర్థం, మన రోడ్లు కూడా భాగమైన ఒక పెద్ద అంతర్జాతీయ రోడ్డు వ్యవస్థ 32 దేశాల్లో ఉందన్నమాట. ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన గౌరవంగా, భవిష్యత్తులో వాణిజ్యం, రవాణాకు ఉపయోగపడే అవకాశంగా చూడాలి