ప్రపంచం వివిధ భిన్న సాంస్కృతి సాంప్రదాయాలతో మనుగడ సాగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయకమైన జీవన శైలి ఒకరికి నచ్చినది మరొకరికి నచ్చకపోవచ్చు. పూర్వీకుల నుండి వచ్చిన అనేకమైన సాంప్రదాయ వంటకాలలో ఆరోగ్యాన్ని సంరక్షించే సాంప్రదాయం వంటకాలు కూడా ఉంటాయి అందులోనే భాగమే ఎర్ర చీమల పచ్చడి. అసలు ఈ ఎర్ర చీమల పచ్చడి చేస్తారని మీకు తెలుసా? ఒడిశాలోని సింలి పాలి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించే గిరిజనులు ప్రాచీన కాలం నుంచి స్థానికంగా లభించే ‘కైం బీంపూడి’ అనే ఎర్ర చీమలతో ప్రత్యేకమైన చీమల పచ్చడిని తయారు చేస్తున్నారు. ఈ పచ్చడికి కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగ్‌ను మంజూరు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
అయితే ఈ చీమల పచ్చడి ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పచ్చడి తయారీలో ప్రధానంగా ఎర్ర చీమలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఉపయోగిస్తారు.
ముందుగా సేకరించిన ఎర్ర చీమలను పచ్చిమిర్చి ను బాణలిలో వేసి స్వల్పంగా గోరువెచ్చగా అయ్యే వరకు వేయించాలి. అనంతరం వాటిని తగినంత ఉప్పు వెల్లుల్లిపాయలు, అల్లం, తో కలిసి రోటిలో వేసి బాగా దంచాలి. అంతే సంప్రదాయ ఎర్ర చీమల పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి రొట్టెలతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని అక్కడి గిరిజనులు తెలుపుతున్నారు.
ఎర్ర చీమల పచ్చడిని తీసుకోవడం వల్ల జ్వరం రాదని ముఖ్యంగా శ్రమ ఎక్కువ చేసే యువకులు, అబ్బాయిలు తింటే శరీరానికి బలం, వస్తుందని అక్కడి ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. అందుకే ఇది సాధారణ వంటలా కాకుండా, అబ్బాయిల కోసం ప్రత్యేకంగా చేసే పవర్ ఫుడ్‌లా మాట్లాడుకుంటారు. బయటవాళ్లకు ఇది వింతగా అనిపించినా ఇది వారి సంప్రదాయం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య నమ్మకం కూడా కావడం గమనార్హం.