విశాఖపట్నంలో నేవీ డే వేడుకల సందడి ముందుగానే మొదలైంది. డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ఆరంభ ఘట్టంగా తూర్పు నావికాదళ కమాండ్ నిర్వహించిన “సర్గమ్ 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా” సముద్రిక ఆడిటోరియంలో అద్భుతమైన వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు నేవల్ అధికారులైన రజనీష్ శర్మ, కిషోర్‌తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లోని శౌర్య అతిథిగృహానికి చేరుకోగా, అక్కడ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత పవన్ కళ్యాణ్ సముద్రికకు చేరుకున్నప్పుడు చీఫ్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఆయన సతీమణి ప్రియా భల్లా సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది నేవీ బ్యాండ్ అందించిన ఘన సంగీత ప్రదర్శన. ఈస్ట్రన్ నావెల్ కమాండ్ సింఫనిక్ బ్యాండ్ దర్శకుడు సతీష్ ఛాంపియన్, డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మార్గదర్శకత్వంలో దేశభక్తి గీతాలు, హిందీ రాగాలు, పర్యావరణ అంశాలపై రూపొందించిన ప్రత్యేక సంగీత ప్రేక్షకులను గంటకు పైగా మంత్రముగ్ధుల్ని చేశాయి. నేవీ సిబ్బంది క్రమశిక్షణతో, లయబద్ధంగా అందించిన ప్రతి స్వరమే సభలో ఉన్నవారిలో దేశభక్తి జ్వాలను మేల్కొలిపేలా నిలిచింది.
కార్యక్రమం చివరిలో ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “లయన్ కింగ్ మ్యూజిక్ మెమెంటో”ను శరత్‌కుమార్ సింగ్ బాబుకు అందజేయడం జరిగింది. అనంతరం వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ “టోకెన్ ఆఫ్ రెమెంబ్రెన్స్” స్వీకరించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు. దేశ రక్షణలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నిలిచే నేవల్ కమాండ్ ప్రతిభ, ప్రతిష్ట, సేవాభావాన్ని ప్రతిబింబించేలా సర్గమ్ 2025 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని అందించింది.