మున్సిపల్ వాటర్ వర్క్స్‌పై మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీ..
తాగునీటి సమస్యపై అధికారులకు మంత్రి నిమ్మల క్లాస్..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి సమస్యపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఉదయం ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
మంచినీటి చెరువుల్లో ప్రస్తుతం ఎంత నీరు నిల్వ ఉందో, ఇంకా ఎన్ని రోజుల పాటు సరఫరా చేయగలమో అధికారులతో కలిసి మంత్రి అంచనా వేశారు. ముందస్తుగా పరిస్థితిని గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు చేపట్టలేదని అధికారులను ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడే వరకు ఎదురు చూడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట్ల యుద్ధ ప్రాతిపదికన బోరు బావుల త్రవ్వకాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బోరు పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మంచినీటి చెరువు వద్దే కొంతసేపు గడుపుతూ పరిస్థితిని నేరుగా పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులతో పాటు కిందస్థాయి వాటర్ వర్క్స్ సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోజు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ప్రజల అవసరాలపై ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన మరోసారి చూపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.